అమ్మాయిలూ అమెరికాలో వద్దు… వచ్చేయండి…!

తమ పిల్లలు అమెరికాలో సెటిలయ్యారు.. అమెరికాలో చదువుకుంటున్నారు.. అమెరికా సంబంధం.. ఇలా అమెరికా అంటేనే అదో స్టేటస్‌లా ఫీలయ్యేవారు గతంలో.. కానీ పరిస్థిలు మారిపోయాయ్‌ ఇప్పుడు. అమెరికా అంటే పెద్దగా ఇంట్రెస్ట్‌ చూపించడంలో లేదిప్పుడు. ముఖ్యంగా అమ్మాయిల్ని అమెరికాలో ఉంచేందుకు సుముఖత వ్యక్తం చేయడంలేదు.. దానికి చాలా కారణాలే ఉన్నాయి.

అమెరికాలో తమ అమ్మాయిలు ఉండటం… భారతీయ తల్లి తండ్రులకు ఇష్టం లేదని చెప్తుంది ఒక సర్వే. సాధారణంగా అమెరికా లాంటి అగ్ర దేశాల్లో చదువులు అంటే చాలా మంది పిల్లలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. తల్లి తండ్రుల ఆర్ధిక స్థోమతను ఆధారంగా చేసుకుని విదేశాల్లో చదివేందుకు మొగ్గు చూపుతూ ఉంటారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి, అక్కడే స్థిరపడాలని భావిస్తున్నారు. అయితే ఇప్పుడు తల్లి తండ్రులకు ఇది ఇష్టం లేదట… అబ్బాయిలు కాదులెండి… కేవలం అమ్మాయిలు మాత్రమే… తమ ఆడపిల్ల అమెరికాలో వద్దంటున్నారట.

ఇటీవల రాజస్థాన్ కి సంబంధించిన ఒక ప్రముఖ కళాశాల ఈ అంశంపై దక్షిణ భారతదేశంలోని రెండు రాష్ట్రాల్లో 600 కుటుంబాల మీద సర్వే చేసింది. ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమ ఆడపిల్లలు అమెరికాలో ఉండటం ఎంత మాత్రం ఇష్టం లేదని సర్వేలో 53 శాతం మంది తల్లి తండ్రులు అంగీకరించారట. దీనికి పలు కారణాలు కూడా వారు వివరించడం గమనార్హం… తమ పిల్లలు అక్కడి సంస్కృతికి అలవాటు పడి తమను కనీసం లెక్క చేయడం లేదని, భవిష్యత్తులో… పెళ్లి చేసినా భర్తను కూడా ఇలాగే చూస్తారని,

పాస్చాత్య ధోరణితో వాళ్ళు వెళ్లడం ద్వారా భవిష్యత్తు లేకుండా పోతుందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఐటి ఉద్యోగాల ద్వారా తమ పిల్లలకు అనేక సమస్యలు వస్తున్నాయని, సంపాదించాలి అనే ఆశతో ఎక్కువ కష్టపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తల్లి తండ్రులు పేర్కొన్నారు. అయితే పెళ్లి తర్వాత కూడా తమ పిల్లలు అమెరికాలో ఉండటం ఇష్టం లేదట ఆడపిల్లల తల్లి తండ్రులకు, అక్కడి సంస్కృతికి అలవాటు పడటమే కాకుండా పుట్టిన పిల్లలను కూడా గాలికి వదిలేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని వారు అభిప్రాయపడ్డారు. మరికొందరు అయితే అక్కడ చదువుకుని ఇక్కడికి వచ్చేయాలని కోరుతున్నారట.