సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తి ఎన్వీ రమణ రేపు (శనివారం) ప్రమాణస్వీకారం చేయనున్నారు. 48వ సీజేఐగా జస్టిస్ ఎన్.వి.రమణతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ప్రస్తుతం భారత ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే పదవి కాలం నేటితో (ఏప్రిల్ 23) ముగియనుంది. దీంతో బోబ్డే నేడు పదవీ విరమణ చేయనుండగా రేపు ఎన్వీ రమణ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్వీ రమణ వచ్చే ఏడాది ఆగస్టు 26 (2022) వరకు అంటే 16 నెలల పాటు భారత ప్రధాన న్యాయమూర్తిగా సేవలదించనున్నారు.
కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రమాణస్వీకారం కార్యక్రమానికి చాలా కొద్ది మంది అతిథులు మాత్రమే హాజరు కానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేబినెట్ మంత్రులు, న్యాయమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, జస్టిస్ ఎన్.వి.రమణ కుటుంబసభ్యులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశముంది.
కాగా ఎన్వీ రమణ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా. 1957 ఆగస్టు 27న జన్మించిన ఆయన 1983లో లాయర్ గా ప్రాక్టీసు మొదలుపెట్టారు. 2000 సంవత్సరం జూన్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులవడంతో పాటు ఢిల్లీ హైకోర్టుకు చీఫ్ జస్టిస్‌గా పని చేసారు. అలానే 2014 ఫిబ్రవరిలో సుప్రీం కోర్టుకు పదోన్నతి పొంది… ప్రస్తుతం సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. కాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న రెండో తెలుగు వ్యక్తిగా ఎన్వీ రమణ రికార్డు సృష్టించనున్నారు. సీజేఐగా పని చేసిన మొదటి తెలుగు వ్యక్తి జస్టిస్ కోకా సుబ్బారావు.ఆయన 1966 జూన్ 30 నుంచి 1967 ఏప్రిల్ 11 వరకూ సీజేఐగా పనిచేశారు.