ఉన్నతమయిన భాష ఉన్నతమయిన వ్యక్తీకరణ ఇవేవీ లేకుండా ఓ ముఖ్యమంత్రి ఎలా మాట్లాడతారు? ఆయనను చూసేనా వీళ్లు మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో బూతులు మాట్లాడినా ఆ రోజు నవ్వులు చిందించింది ఇందుకేనా ? అంటూ జగన్ ను ఉద్దేశించి టీడీపీ ప్రశ్నిస్తోంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నా వెంట్రుక కూడా పీకలేరు అని పలకడం అదీ ఓ అధికారిక కార్యక్రమంలో మాట్లాడడం నిజంగానే రాజ్యాంగ ధిక్కారమే! దీనిపై విపక్ష సభ్యులు కోర్టుకు పోయినా ఆశ్చర్యపోనవసరం లేదు.
అత్యంత విచారకర స్థితిలో ఓ ముఖ్యమంత్రి భాష ఉంటే మరి మంత్రులు ఏమౌతారు.. వారెలా మాట్లాడతారు.. అందుకే కొడాలి నాని లాంటి వారు అడ్డూ అదుపూ లేకుండా ఉంటున్నారు అని అనేందుకు నిన్నటి సీఎం ప్రవర్తన మరియు భాషే ఓ ఆధారం. ఓ రుజువు కూడా !
దురదృష్టమో, అదృష్టమో కానీ గతంలో ఉన్న ముఖ్యమంత్రుల భాష ఈ విధంగా ఉందా అన్న ప్రశ్నకు ఈ ఉదయం ఆస్కారం ఇవ్వాలి. ఎందుకంటే చంద్రబాబు కానీ అంతకుముందు పనిచేసిన వారు కూడా ఆఖరికి ఎన్టీఆర్ కూడా ఇటువంటి భాషను మాట్లాడలేదు. ఎందుకనో అయితే సానుభూతి పొందాలనుకోవడం లేదా విపక్షాలపై విరుచుకుపడి ప్రశ్నించే వారిని నియంత్రించాలనుకోవడం ఈ రెండూ మినహా వైఎస్సార్సీపీ రాజకీయంలో మొదట్నుంచి కొత్తదనం లేదు. ఇక రాదు కూడా! ఎందుకంటే ఆ రెండు సూత్రాల ఆధారంగానే వైఎస్సార్సీపీ ఇంతకాలం నెట్టుకు వస్తోంది.
నాన్న మరణం తరువాత జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర మొత్తం సానుభూతి రాజకీయంలో భాగంగానే చేశారని టీడీపీ ఇప్పటికీ ఎద్దేవా చేస్తోంది. తరువాత కూడా ఆయన ప్రజల్లో సింపతీని కూడగట్టేందుకు వైజాగ్ ఎయిర్ పోర్ట్ కేంద్రంగా కోడి కత్తి డ్రామా ఆడారని కూడా అంటోంది టీడీపీ. టీడీపీ విమర్శలు ఎలా ఉన్నా కూడా నిన్నటి వేళ జగన్ భాష బాలేదు. మొన్నటి వేళ కూడా జగన్ భాష బాలేదు. విపక్షాలను తిట్టినంత మాత్రాన అబద్ధాలు నిజాలు అయిపోవు..నిజాలు అబద్ధాలుగా మారిపోవు.ఈ చిన్న లాజిక్ ను జగన్ ఎందుకనో మిస్ అవుతున్నారు.
నా వెంట్రుక కూడా పీకలేరు ఇది రాయదగ్గ భాషేనా ! ఓ మీడియా అధిపతి అయి కూడా ఈ విధంగా మాట్లాడడం సబబేనా ! అంటే ఆయన అభద్రతలో ఉన్నారా లేదా ఆత్మ విశ్వాసంతో ఉన్నారా ? అభద్రతలో ఉన్నప్పుడు కూడా పైకి గంభీరం అయిన మాటలు కొన్ని వినిపిస్తాయి. ఆత్మ విశ్వాసం ఎక్కువయినా కూడా ఇలాంటి మాటలే వెల్లడిలోకి వస్తాయి. అయినా ఆయన ఒక సీఎం. కొడాలి నాని లాంటివారి భాషకు ఆయన కొనసాగింపు ఎలా ఇస్తారు. ఇంతవరకూ కొడాలి నానితో ఆ తరహా బూతుల భాష
మాట్లాడించింది జగనేనా అన్న సందేహం ఒకటి ఇప్పుడు టీడీపీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్ స్క్రిప్ట్ అనుకోవాలా అని కూడా ప్రశ్నిస్తోంది టీడీపీ. ఏదేమయినప్పటికీ ఓ ముఖ్యమంత్రి ఇంతటి దిగజారుడు భాష మాట్లాడడం భావ్యం కాదు సమర్థనీయం కాదు సహేతుకం కూడా కాదు.