తెలంగాణలో రాజకీయాలు చకచకా మారిపోతున్నాయి. సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశంలో పని చేయని ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వను అని తెగేసి చెప్పారు. దీంతో ఆశావహుల సంఖ్య ఆయా నియోజకవర్గాల్లో పెరిగిపోతుంది. ముఖ్యంగా అధికారులుగా పని చేస్తున్న వారు సీఎం కేసీఆర్ దగ్గర మంచి పేరు సంపాదించుకుని టికెట్ల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ రేసులో రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాస్ ముందు వరసలో ఉన్నారు. తన సొంత నియోజకవర్గం కొత్తగూడెం నుంచి పోటీ చేయాలని విస్తృతంగా పర్యటిస్తున్నారు. తండ్రి పేరిట ట్రస్టు పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో ఈయన సామాజిక వర్గానికి చెందిన ఓట్లు దాదాపు 30 నుంచి 35 వేల వరకు ఉంటాయి. ప్రభుత్వ ఆదేశాలతో గడల శ్రీనివాస రావు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు కొడుకుపై తీవ్రమైన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో గడలకు రూట్ క్లియర్ అయినట్లు సమాచారం. ఈ సారి ఎలాగైనా టికెట్ సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
గడల శ్రీనివాస్ కాకుండా మరో ఇద్దరు వైద్యాధికారులు కారు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు డాక్టర్ రమేశ్ రెడ్డి సైతం బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. ఈయనకు గతంలో విద్యార్థి నాయకుడిగా పని చేసిన అనుభవం ఉంది. టీఎస్ఎంఎస్ఐడీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ గత ఎన్నికల్లో అందోల్ నియోజకవర్గం టికెట్ ఆశించి భంగపడ్డారు. ఈ సారి కచ్చితంగా టికెట్ సాధించాలనే కృత నిశ్చయంతో ఉన్నారు. టీఎన్జీవో నేత మామిళ్ల రాజేందర్, నీలోపర్ లో ఒక సీనియర్ వైద్యుడు, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఒక డీఎంహెచ్ వో బీఆర్ఎస్ లో టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. ఇందులో ఎవరికి టికెట్ దక్కుతుందో ఎన్నికల నాటికి తేలిపోనుంది.