ప్రపంచాన్ని మరోసారి ఓమిక్రాన్ రూపంలో కరోనా భయపెడుతోంది. ఇప్పటికే 50 పైగా దేశాలకు వ్యాపించింది. 2 వేలకు పైగా కేసులు నమోాదయ్యాయి. దక్షిణాఫ్రికాలో పుట్టిన ఈ వేరియంట్ తక్కువ కాలంలోనే ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. దీంతో అన్ని దేశాలు అప్రమత్తం అయ్యాయి. ఓమిక్రాన్ కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం అన్ని దేశాల్లో మరోసారి వ్యాక్సిన్ ప్రాముఖ్యత ఏర్పడింది. ఇప్పటికే వ్యాక్సిన్ డోసులు తీసుకున్నా.. బూస్టర్ డోసులు వేయాలని ప్రతిపాదనలు చేస్తున్నాయి పలు దేశాలు.
ఇండియాలో కూడా బూస్టర్ డోెసులపై నిర్ణయం తీసుకోవాలని పలు రాష్ట్రాలు, కేంద్రాన్ని కోరాయి. వైద్య సిబ్బందికి, ఫ్రంట్ లైన్ వారియర్స్ కి మళ్లీ వ్యాక్సిన్ ఇవ్వాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. అయితే ఇప్పటికే కోవిషీల్డ్ బూస్టర్ డోసు అనుమతికి సీరం ఇన్ స్టిట్యూట్ డీసీజీఐ కి దరఖాస్తు చేసుకుంది. దీంతో కోవిషీల్డ్ బూస్టర్ డోెసులకు అనుమతి ఇచ్చే విషయంపై నేడు ఆరోగ్య శాఖ నిపుణుల కమిటీ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. దీనికి ఆమోదం లభిస్తే రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వారికి ముందు బూస్టర్ డోసు ఇవ్వనున్నారు.