తెలంగాణలో విస్తరిస్తున్న ఓమిక్రాన్… మూడు జిల్లాల్లో 5 కేసులు నమోదు..

-

తెలంగాణలో ఓమిక్రాన్ కేసులు క్రమంగా విస్తరిస్తున్నాయి. కొత్తకొత్త ప్రాంతాలకు ఓమిక్రాన్ విస్తరిస్తోంది. తాజాగా ఈరోజు తెలంగాణలో కొత్తగా 5 కేసులు నమోదయ్యాయి. సిరిసిల్లలో 3, ఖమ్మంలో 1, హన్మకొండలో 1 కేసు నమోదైంది. దీంతో తెలంగాణలో కేసుల సంఖ్య 41 నుంచి 46కు పెరిగాయి. ఇన్నాళ్లు హైదరాబాద్ కు పరిమితమైన ఓమిక్రాన్ కేసులు నెమ్మదిగా జిల్లాలకు కూడా విస్తరిస్తున్నాయి.

ఇటీవల హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న ఓ యువతి ఖమ్మంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది. కోవిడ్ లక్షణాలు ఉండగా టెస్ట్ చేయించుకుంది. దీంట్లో ఓమిక్రాన్ గా బయటపడింది. దీంతో ఒక్కసారిగా ఖమ్మం జిల్లా వైద్యసిబ్బంది అలెర్ట్ అయ్యారు సదరు యువతితో సన్నిహితంగా మెలిగిన అందరికీ టెస్టులు చేస్తున్నారు. మరో వైపు ఇటీవల స్విట్జర్లాండ్ నుంచి హన్మకొండకు వచ్చిన ఓ వ్యక్తికి కూడా ఓమిక్రాన్ పాజిటివ్ గా తేలింది.

సిరిసిల్లలో మరో మూడు కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల దుబాయ్ నుంచి స్వస్థలానికి వచ్చిన వ్యక్తి నుంచి అతని భార్య, తల్లి, స్నేహితుడికి ఓమిక్రాన్ వైరస్ వ్యాపించినట్లు తేలింది. దీంతో వీరందరిని అధికారులు హైదరాబాద్ టిమ్స్ కు పంపించి చికిత్స అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news