తెలంగాణలో ఓమిక్రాన్ కేసులు విజృంభిస్తున్నాయి. ఓమిక్రాన్ కేసులు ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. ఇవాళ ఒక్క రోజే తెలంగాణలో కొత్తగా 12 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కేసుల సంఖ్య 56కు చేరింది. తెలంగాణలో ఇప్పటి వరకు ఓమిక్రాన్ బారిన పడిన వారిలో 10 మంది కోలుకున్నారు. అయితే ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో పెద్దగా లక్షణాలు ఏం ఉండటం లేదని తెలుస్తోంది. కాగా ఇన్నాళ్లు హైదరాబాద్ కే పరిమితమైన ఓమిక్రాన్ కేసులు ప్రస్తుతం జిల్లాలకు కూడా వ్యాపించడం ఆందోళన కలిగించే అంశం. తెలంగాణ ఓమిక్రాన్ నేపథ్యంలో ఈనెల 30 నుంచి జవవరి 2 వరకు ఆంక్షలు కూడా విధించింది. న్యూ ఇయర్ వేడుకల్లో ప్రజలు గుమిగూడకుండా… సభలు, సమావేశాలు, ర్యాలీను నిషేధించింది ప్రభుత్వం.
దేశంలో ఓమిక్రాన్ సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే కేసుల సంఖ్య 600 వందలకు చేరువైంది. ఇప్పటికే దేశంలో 20 రాష్ట్రాలకు ఓమిక్రాన్ విస్తరించింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. చాలా రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు విధిస్తున్నాయి. న్యూ ఇమర్ వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నాయి. మరోవైపు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను హెచ్చిరిస్తూ… లేఖలు రాసింది. ఓమిక్రాన్ పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించింది.