ఆధార్ కార్డు ఉంటే.. ప‌ది నిమిషాల్లో పాన్ కార్డ్‌.. ఎలాగో తెలుసా..?

-

ఆధార్ కార్డు.. ఎంతో కీలకమైన డాక్యుమెంట్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందాలన్నా.. లేదంటే ఇతర బెనిఫిట్స్ ఏమైనా కావాలన్నా ఆధార్ కార్డు కచ్చితంగా ఉండాల్సిందే. అయితే ఇకపై ఆధార్ కార్డు ఉంటే చాలు… కొన్ని నిమిషాల్లోనే పాన్ కార్డు వచ్చేస్తుంది. ఆధార్ వివరాలను ఆన్ లైన్ లో ఇస్తే చాలు… వెంటనే పాన్ ను జారీ చేస్తారు. పీడీఎఫ్ ఫార్మాట్ లో వుండే దీనిని వెంటనే డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇక ఆధార్ కార్డు ఉన్నవాళ్లు, పాన్ కార్డు పొందాలంటే ఏం చేయాలంటే… తొలుత ఇన్ కమ్ టాక్స్ ఈ ఫైలింగ్ పోర్టల్ కు వెళ్లి, ‘ఇన్ స్టంట్ పాన్ థ్రూ ఆధార్’ లింక్ పై క్లిక్ చేసి, ఆపై ‘గెట్ న్యూ పాన్’ ఆప్షన్ ఎంచుకోవాలి. కొత్త పాన్ సంఖ్య కోసం మీ ఆధార్ సంఖ్యను అడుగుతుంది.

అక్కడ ఇచ్చిన బాక్స్ లో ఆధార్ ను ఎంటర్ చేస్తే, మీ ఆధార్ కు అనుసంధానితమైన ఫోన్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయగానే, ఇతర ఆధార్ లోని వివరాలను అడుగుతుంది. మీ ఈ మెయిల్ ను, ఇతర వివరాలను ఎంటర్ చేయగానే, యూఐడీఏఐ డేటాలో సరిచూసుకునే ఐటీ వెబ్ సైట్, వెంటనే పాన్ నంబర్ ను కేటాయిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియకు పదంటే పది నిమిషాలు కూడా పట్టదు. ఆపై మీ పాన్ కార్డును పీడీఎఫ్ ఫార్మాట్ లో డౌన్ లోడ్ చేసుకుని ప్రింటవుట్ తీసుకోవచ్చు. మీ ఈ మెయిల్ కు కూడా పాన్ కార్డు పీడీఎఫ్ వస్తుంది. అయితే, మీ మొబైల్ నంబర్ ను ఆధార్ కు అనుసంధానించి వుండాలి. గతంలో పాన్ కార్డును పొందని వారికి మాత్రమే ఈ అవకాశం.

Read more RELATED
Recommended to you

Latest news