కొత్తగా పీసీసీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి దూకుడు రాజకీయాలు చేస్తూ, తెలంగాణలో కాంగ్రెస్‌ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అలాగే అసంతృప్తిగా ఉన్న నేతలని బుజ్జగిస్తూ పార్టీని గాడిలో పెట్టేందుకు చూస్తున్నారు. అయితే ఇక్కడే కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ మొదలయ్యాయి. కాంగ్రెస్‌ని ప్రత్యర్ధులు దెబ్బకొట్టకుండానే వారిలో వారే దెబ్బకొట్టుకోవడం కామన్ అయిపోయింది.
కేసీఆర్ ప్రభుత్వం దళితులని ఆకట్టుకోవడానికి దళితబంధు పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక దీనికి కౌంటర్‌గా రేవంత్ రెడ్డి దండోరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దళితులు, గిరిజనులకు అండగా నిలబడటంలో భాగంగా ఆగస్టు 9న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో దండు కట్టి దండోరా వేస్తున్నామని రేవంత్ ప్రకటించారు.
ఈ సభని సక్సెస్ చేసే బాధ్యత మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్ రావుకు అప్పగించారు. ఇటీవల ప్రేమ్‌సాగర్ రావు ఇంటికెళ్ళి మరీ రేవంత్ దండోరా కార్యక్రమాన్ని ప్రకటించారు. ఇక ఇదే అంశం మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి చిరాకు తెప్పించిందని తెలుస్తోంది. కొత్తగా ప్రకటించిన పీసీసీలో మహేశ్వర్‌రెడ్డికి ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. అలాగే పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఆయన సభ్యుడు కూడా. దీంతో దండోరా కార్యక్రమంపై రేవంత్ ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని మహేశ్వర్ రెడ్డి, తాజాగా జరిగిన సమావేశంలో ఫైర్ అయ్యారని తెలిసింది. దీనికి కౌంటర్‌గా రేవంత్ సైతం, ఇంద్రవెల్లికి నీకు ఏం సంబంధం అని మహేశ్వర్ రెడ్డిని ప్రశ్నించారట. నిర్మల్‌కే పరిమితం అవ్వండి అంటూ రేవంత్ సూచించారని తెలుస్తోంది.
ఈ విధంగా సొంత నేతలతోనే రేవంత్‌కు కొత్త తలనొప్పి మొదలైనట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ తీసుకున్న నిర్ణయానికి నాయకులు కట్టుబడి ఉంటే బాగుంటుందని, కానీ కాంగ్రెస్‌లో ఆ పరిస్తితి ఉండదు కాబట్టే ఈ రచ్చ అంతా జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఏదేమైనా కాంగ్రెస్‌కు కాంగ్రెస్సే శత్రువు అని మళ్ళీ రుజువైంది.