ఆస్కార్.. ప్రపంచంలోని ప్రతి సినిమా నటుడు, సాంకేతిక నిపుణుడు ముద్దాడాలని చూసే పురస్కారం.
95వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఆస్కార్ వేడుకకు ఘన చరిత్ర ఉన్నట్టే.. ఆస్కార్ పురస్కార ప్రతిమకూ ఓ హిస్టరీ ఉంది. ఈ ఏడాది మార్చి 12న ఆస్కార్ వేడుక అట్టహాసంగా జరగనుంది. అయితే ఆస్కార్ అవార్డు అసలు నగ్నంగా ఎందుకు ఉంటుంది..? దీనికి ఆస్కార్ అనే పేరు ఎలా వచ్చింది..? ఇలా.. ఆస్కార్ అవార్డ్ గురించి కొన్ని ప్రత్యేక విషయాలు తెలుసుకుందాం.
హాలీవుడ్ నటులు, దర్శకులు, నిర్మాతలు, రచయితలు, సాంకేతిక నిపుణులతో కూడిన 5 విభాగాలతో 1927లో ‘ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సంస్థ’ ఏర్పడింది. అదే 1929 నుంచి చలన చిత్ర రంగంలో విశేష ప్రతిభ చూపిన వారికి ‘అకాడమీ ఆవార్డ్ ఆఫ్ మెరిట్’ పేరిట పురస్కారాలు ఇవ్వడం ప్రారంభించింది. ఆ తర్వాత, వీటిని ఆస్కార్ పురస్కారాలుగా పిలవడం మొదలైంది.
ఆస్కార్ అవార్డును ఎవరు సృష్టించారు?
ఆస్కార్ ప్రతిమ.. కాంతులీనే పసిడి వర్ణంతో, ఓ యోధుడు రెండు చేతులతో వీర ఖడ్గం చేతపట్టి ఫిల్మ్ రీలుపై ఠీవీగా నిల్చొన్నట్టు కనిపిస్తుంది. ఈ రూపును ఎంజీఎం స్టూడియో ఆర్ట్ డైరెక్టర్ కెడ్రిక్ గిబ్బన్స్ సృష్టించారు.
ఆస్కార్ పురస్కారానికి ఆ పేరు ఎలా వచ్చింది?
ఈ పురస్కారాలకు ఆస్కార్ అని పేరు రావడం వెనక ఓ ప్రచారం ఉంది. తొలిసారి ఈ పురస్కార ప్రతిమను చూసిన అకాడమీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్గరెట్ హెర్రిక్.. అందులోని యోధుడు అచ్చం తన అంకుల్ ఆస్కార్లా ఉన్నాడని అందట. ఆ తర్వాత హాలీవుడ్ కాలమిస్ట్ సిడ్నీ స్కోల్స్కీ తన వ్యాసంలో వీటిని ఆస్కార్ పురస్కారాలని ప్రస్తావించాడట. అలా ‘ఆస్కార్’ వాడుకలోకి వచ్చింది.
ఆస్కార్ అవార్డు నగ్నంగా ఎందుకు ఉంటుంది?
ఆస్కార్ ప్రతిమ కింది భాగంలోని రీలు చుట్టులో 5 చువ్వలుంటాయి. అకాడమీలోని 5 విభాగాలకు అవి సూచికలు. ఎమిలో ఫెర్నాండెజ్ అనే నటుడిని నగ్నంగా నిలబెట్టి అతడి ఆకారం నుంచి స్ఫూర్తిపొంది.. గిబ్బన్స్ ఈ ప్రతిమను రూపొందించాడట. అందుకే ఆస్కార్ ప్రతిమ నగ్నంగా కనిపిస్తుంది.
తొలిసారి ఆస్కార్ అవార్డు ఎవరు అందుకున్నారు?
మొదటిసారిగా ఆస్కార్ అందుకున్న నటుడు ఎమిల్ జన్నింగ్స్. ‘ది లాస్ట్ కమాండ్’ చిత్రానికిగానూ ఆయన ఉత్తమ నటుడిగా ఈ అవార్డు స్వీకరించారు.