చెన్నై జూలో కలకలం.. హఠాత్తుగా ఆస్ట్రిచ్ పక్షుల మరణం

చెన్నై లోని అరిగ్నార్ అన్నా జూవలాజికల్ పార్క్ వార్తల్లోకి ఎక్కింది. తాజాగా బుధవారం హఠాత్తుగా అనారోగ్యం పాలై 5 ఆస్ట్రిచ్ పక్షులు మరణించాయి. జూలో మొత్తం 32 ఆస్ట్రిచ్ లు ఉంటే మరికొన్ని అనారోగ్యంతో బాధపడుతున్నాయి. వీటి ఆరోగ్యాన్ని వెటర్నరీ వైద్యులు, నిపుణులు జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. అసలు ఏం వ్యాధి సోకి మరణిస్తున్నాయనే విషయం జూ సిబ్బందికి అంతుబట్టడం లేదు. ప్రస్తుతం పక్షుల నమూనాలను బ్యాక్టీరియాలజీ, వైరాలజీ, టాక్సికాలజీ పరీక్షల కోసం పరిశోధనశాలకు పంపించారు.

 బుధవారం పక్షులను పరిశీలించిన వైద్యులు ఫౌల్ కలరా వ్యాధి వచ్చిందనే విషయాన్ని కొట్టిపారేశారు. స్థానికంగా వండలూర్ జంతుప్రదర్శనశాలగా పిలువబడే ఈ జూలో 180 జాతులతో మొత్తం 2400 జంతువులను కలిగి ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో కూడా ఈ జూ వార్తల్లో నిలిచింది. కోవిడ్ పాండమిక్ సమయంలో జూలోని 15 ఆసియాటిక్ సింహాలకు కోవిడ్ పరీక్షలు చేయగా 10 సింహాలకు డెల్టా వేరియంట్ సోకినట్లు నిర్ధారణ అయింది. వీటిలో ఒక మగ, ఆడ సింహాలు కోవిడ్ వల్ల మరణించగా 13 సింహాలకు వైద్యాన్ని అందించి రక్షించుకోగలిగారు.