భారత్‌లో కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి గాను సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఫైజర్, భారత్ బయోటెక్‌లు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విషయం విదితమే. కాగా డిసెంబర్ 9న సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో) సదరు 3 కంపెనీలకు చెందిన దరఖాస్తులను సమీక్షించింది. ఈ క్రమంలో వ్యాక్సిన్లకు సంబంధించి మరింత సమాచారం కావాలని కోరింది. అయితే సీరమ్ ఇనిస్టిట్యూట్ ఇప్పటికే ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌కు సంబంధించి సీడీఎస్‌సీవో అడిగిన మరిన్ని వివరాలను అందజేసింది. దీంతో వచ్చే వారంలోనే ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌కు భారత్‌లో అనుమతి లభించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
కాగా ఫైజర్ వ్యాక్సిన్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నప్పటికీ దాన్ని అతి శీతల ఉష్ణోగ్రతలు ఉన్న బాక్సుల్లో స్టోర్ చేయాల్సి ఉంటుంది కనుక.. అలాంటి సామగ్రిని ఏర్పాటు చేయడం, నిర్వహించడం ఖరీదైన వ్యవహారం కాబట్టి.. ఫైజర్ వ్యాక్సిన్‌పై భారత్ అంత సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. అయినప్పటికీ బహిరంగ మార్కెట్లో విక్రయించుకునేలా ఫైజర్ వ్యాక్సిన్‌కు అనుమతి ఇస్తారని తెలుస్తోంది. ఇక భారత్ బయోటెక్ వ్యాక్సిన్ జనవరి లేదా ఫిబ్రవరిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ క్రమంలోనే సీరమ్ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ భారత్‌లో ఇతర వ్యాక్సిన్ల కన్నా ముందుగా అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.
అయితే నిజానికి ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌ను స్టోర్ చేసేందుకు తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటే చాలు, అతి శీతల ఉష్ణోగ్రతలు అవసరం లేదు. అందువల్ల భారత్ లాంటి దేశాలకు ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఎంతో ఉపయోగపడుతుంది. అయితే వచ్చే వారం అనుమతి లభించేటట్లయితే మొదటి విడతలో భాగంగా మొత్తం 30 కోట్ల మంది నెల రోజుల్లో 60 కోట్ల డోసులను వేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే సీరమ్ ఇనిస్టిట్యూట్ ప్రస్తుతం వ్యాక్సిన్‌ను శరవేగంగా ఉత్పత్తి చేస్తోంది. వచ్చే వారంలో అనుమతి వస్తే జనవరి నుంచి వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ దేశంలో ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.