పాదయాత్ర తనకి ఎన్నో పాఠాలు నేర్పింది అని అన్నారు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు తన భారత్ జోడో యాత్రకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నేడు శ్రీనగర్ లో నిర్వహించిన భారత్ జోడు ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ.. కాశ్మీర్ కు మళ్లీ రాష్ట్ర హోదా ఇస్తామని ప్రకటించారు. పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలు తమ బాధలు తనతో పంచుకున్నారని తెలిపారు.
నేడు మంచు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా సభకు హాజరయ్యారని పేర్కొన్నారు రాహుల్ గాంధీ. ఇక ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. దేశాన్ని విభజించి, విచ్ఛిన్నం చేసే రాజకీయం నడుస్తోందని విమర్శించారు. రాహుల్ ఎక్కడికి వెళ్లినా అతడి కోసం జనం బారులు తీరారని చెప్పుకొచ్చారు. దేశంలో జరుగుతున్న రాజకీయాలు దేశానికి మేలు చేయలేవని చెప్పగలనని అన్నారు. ఇది దేశాన్ని విభజించే, విచ్చిన్నం చేసే రాజకీయం.. అందుకే ఒక విధంగా ఇది ఆధ్యాత్మిక యాత్ర అని పేర్కొన్నారు.