తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్..పాదయాత్రలని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఎవరైతే పాదయాత్రలు చేస్తున్నారో వారిని ఏదొకరకంగా నిలువరించడమే లక్ష్యంగా ముందుకెళుతున్నట్లు కనిపిస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో ఒకేసారి ఇటు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు బ్రేకులు వేసే ప్రయత్నం చేశారు..అటు వైటీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రకు బ్రేకులు వేశారు.
ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా బండి నిర్మల్ జిల్లా భైంసా నుంచి పాదయాత్ర మొదలుపెట్టాలని అనుకున్నారు. అక్కడ సభ పెట్టుకుని ఆ తర్వాత పాదయాత్ర ప్లాన్ చేసుకున్నారు. ఇక పాదయాత్ర కోసం బయలుదేరిన బండిని పోలీసులు మధ్యలోనే ఆపేశారు. భైంసా సున్నిత ప్రాంతమని అక్కడకు వెళ్లడానికి వీలు లేదని చెప్పారు. దీంతో బండి హైకోర్టుకు వెళ్లారు. ఇక కోర్టు బండి పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కాకపోతే భైంసాలో కాకుండా..భైంసాకు మూడు కిలోమీటర్ల దూరంలో పాదయాత్ర, సభ నిర్వహించాలని సూచించింది. అలాగే బండి భైంసా శివారులో పాదయాత్ర చేశారు. సభని కాకుండా భైంసా శివారులో ప్లాన్ చేశారు. అయితే అక్కడ నుంచి బండి పాదయాత్ర సజావుగా సాగుతుందా? లేదా? అనేది డౌటే.
మరోవైపు నర్సంపేటలో పాదయాత్ర చేస్తున్న షర్మిలకు పోలీసులు బ్రేకులు వేశారు. తాజగ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై షర్మిల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. షర్మిల క్షమాపణ చెప్పాలని పాదయాత్రలోకి దూసుకొచ్చి, రాళ్ళ దాడి చేసి, క్యారవాన్కు నిప్పు పెట్టారు. అయితే టీఆర్ఎస్ వారిని కంట్రోల్ చేయకుండా పోలీసులు షర్మిలని అరెస్ట్ చేశారు. అంత ఆందోళనలు చేస్తున్నా సరే టీఆర్ఎస్ శ్రేణులని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.
ఇక 3500 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశానని, ఎక్కడా శాంతిభద్రతల సమస్య రాలేదని షర్మిల అన్నారు. స్థానిక నేతల అక్రమాలను ఎండగట్టడం తప్పా అని ప్రశ్నించారు. ఒక ప్లాన్ ప్రకారమే తన పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రభుత్వం కుట్ర చేసిందని ఆరోపించారు. మొత్తానికి టీఆర్ఎస్ మాత్రం విపక్ష నేతల పాదయాత్రలని అడ్డుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది.