‘తులసి’ కోటలో విరిసిన ‘పద్మం’.. వనసంరక్షణలో తనకు లేరెవరు సాటి..!

-

పద్మ అవార్డుల ప్రధానోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఆరోజు నుంచి సోషల్ మీడియాలో తులసీ గౌడ అనే పేరు మారుమోగిపోతుంది. సాక్షాత్తూ రాష్ట్రపతి చేతులమీదుగా ఓ పెద్దావిడ ఎంతో సాదాసీదాగా..కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేకుండా వచ్చి అవార్డు తీసుకుంది. సుటూబూటు వేసుకున్న పెద్దోళ్లను ఆ దర్బార్ లో ఈ ముసలావిడ లుక్కే మార్చేసింది. అందరి దృష్టి ఈమె మీద పడింది. సంప్రదాయ దుస్తుల్లో 76 ఏళ్ల మహిళ అలా వస్తుంటే..తెలుగుతనం ఉట్టిపడింది. ఆమెను అలా చూసిన వారందరూ అనుకున్నది ఒక్కటే..ఒకవేళ అడవితల్లికే కాని ఆడబిడ్డ ఉండి ఉంటే..ఇలానే ఉంటుందా అన్నట్లు ఉంది ఆ అవ్వ. ఈరోజ ఆమె గురించి ఇంకాస్త డెప్త్ గా తెలుసుకుందాం.

tulasi-gowda

కర్ణాటకకు చెందిన ఈ మనసున్న మారాణి తులసి గౌడ ప్రత్యేకమైన కోటను నిర్మించింది. ఏకంగా 40 వేల వృక్షాలతో వనసామ్రాజ్యాన్నే సృష్టించింది. గత ఆరు దశాబ్దాలుగా పర్యావరణానికి ఆమె చేసిన ఈ సేవే కారణంగానే పద్మశ్రీ అవార్డు వరించింది..ఎంతో మంది ప్రముఖుల మధ్య ఆమె దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నారు. ఆ పెద్దావిడను చూడగానే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎంతో గౌరవంగా ప్రతినమస్కారం చేయడం అక్కడున్న అందర్నీ ఆకర్షించింది.

రెండళ్లకే తండ్రి మరణం..

తులసి గౌడ కర్ణాటకలోని అంకోలా తాలూకా హొన్నాలి గ్రామానికి చెందినవారు. హలక్కీ గిరిజన కుటుంబంలో 194లో నారాయణ, నీల దంపతులకు తులసి గౌడ్‌ జన్మించారు. రెండేళ్ల వయసులోనే తండ్రి మరణించటంతో.. పూట గడవడానికి రోజూ తల్లితో కలిసి కూలీ పనులకు వెళ్లేది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తులసి చదువుకు దూరమైంది. చదవడం, రాయడం రాదు.

12ఏళ్లకే పెళ్లి..కొన్నాళ్లకే భర్త మృతి

ఇలా ఎలాగోలా కష్టాలకోడ్చి జీవిస్తున్న తులసీ గౌడకు 10-12 ఏళ్ల వయసులోనే గోవింద గౌడ అనే వ్యక్తితో వివాహం చేశారు. విధి తన పై మళ్లీ చిన్న చూపు చూసింది.. పెళ్లైన కొన్నాళ్లకే.. ఆమె భర్త మరణించాడు. కష్టాలు తనకేమి కొత్తకాదనుకుంది..ఈ బాధ నుంచి బయటపడటానికి నిత్యం దగ్గర్లోని అడవిలో గడిపేది. అక్కడి చెట్లే ఆమెకు ఓదార్పునిచ్చేవి. ఆనందాన్నిచ్చేవట. అలా ఆమెకు అడవితో అనుబంధం ఏర్పడింది.

అటవీశాఖలో ఉద్యోగం

తులసికి చిన్నతనం నుంచే మొక్కలంటే అపారమైన ప్రేమ. ఎన్నో రకాల మొక్కలు నాటేది. రాను రాను అదే తన జీవితం అయిపోయింది. ఆమె మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం చూసి అటవీ శాఖ అధికారులు ఆమెను తాత్కాలిక ఉద్యోగిగా కూడా నియమించుకున్నారు. ఆమె అంకితభావం చూసి కొన్నాళ్లకు ఆమెను శాశ్వత ఉద్యోగిగా చేశారు. ఇలా 14ఏళ్ల పాటు అటవీశాఖలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు.

విరమణ ఉద్యోగానికే..మనసుకు కాదు

విరమణ ఉద్యోగానికే కానీ మనసుకు కాదనుకుంది తులసి.. మొక్కల పెంపకాన్ని మాత్రం ఆపలేదు. 60ఏళ్లలో నలభై వేలకు పైగా మొక్కలు నాటి వాటిని పెంచి పెద్ద చేసి తులసి వనంగా తీర్చిదిద్దారు. తులసికి చదువుమాత్రమే లేదు..కానీ చెట్ల గురించి ఈమెకు తెలిసినంత పట్టాలు పొందిన వారికి కూడా తెలియదంటే ఆశ్యర్యమే. మొక్కలు ఎప్పుడు నాటాలి, నీళ్లు ఎన్నీ ఏం టైంలో పోయాలి, ఆ మొక్క జీవితకాలం ఎంత, ఔషధగుణాలు ఏంటి ఇలాంటివి ఏం అడిగినా..గుక్కతిప్పుకోకుండా చెప్తాస్తారు తులసీ.

ఎన్‌సైక్లోపిడియా ఆఫ్‌ ఫారెస్ట్‌

పర్యావరణవేత్తలు ఆమెను ‘ఎన్‌సైక్లోపిడియా ఆఫ్‌ ఫారెస్ట్‌’ అని కూడా పిలుస్తారు. కానీ ఆమె ఊరి వాళ్లు మాత్రం ఆమెను వనదేవతగా కొలుస్తారట. ఆమెను చూడటానికే చాలా మంది దూర ప్రాంతాల నుంచి వస్తుంటారంట. అరుదైన వృక్షాల జాతుల గురించి ఈమెను అడిగే తెలుసుకుంటారట. 76ఏళ్ల వయసులోనూ తులసి ఏ మాత్రం అలసట చెందకుండా మొక్కలు నాటి, నీళ్లు పోసి కన్నబిడ్డలా వాటిని పెంచుతారు. తనకొచ్చే పింఛను డబ్బులన్నింటినీ వాటికే ఖర్చు చేస్తున్నారట..

టేకు మొక్కలతో మొదలైన ప్రస్థానం

తులసి మొదట టేకు మొక్కలను పెంచేవారు..అక్కడినుంచి పనస, నంది, ఇంకా పెద్ద వృక్షాలు పెంచే స్థాయి వరకూ ఎదిగారు. మొక్క నాటితే చాలదు.. సంతృప్తి రాదు.. అది మానుగా మారితేనే ఆనందం అని తలసి చెప్తుంటారు..ఈ పెద్దావిడ నేటి తరానికి ఎంతో ఆదర్శప్రాయం

గతంలోనూ అవార్డులు పొందిన ఘనత

ఈ సేవకు గానూ.. గతంలోనూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రియదర్శిని వృక్షమిత్ర పురస్కారాన్ని తులసీ గౌడ అందుకున్నారు. అలాగే కవితా స్మారక పురస్కారం, హెచ్‌ హోన్నయ్య సమాజ సేవా పురస్కారం అందుకున్నారు. ఇక 2020 సంవత్సరానికి గానూ నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మశ్రీ అవార్డుతో భారత ప్రభత్వుం సత్కరించింది.

తులసీ గౌడ తన జీవితం మొత్తం..మొక్కల పెంచటం వాటిని సంరక్షించటంలోనే గడిపింది. ఇన్ని సంవత్సరాలుగా ఆమె ఈ సేవ చేస్తున్నా ఎవరికి పెద్దగా తెలియదు..ఇలాంటి అవార్డులు వచ్చినప్పుడు మాత్రం గొప్పగా చెప్పుకోవటం, సోషల్ మీడియాలో షేర్ చేసుకోవటంతోనే మన పని అయిపోయింది అనుకోకూడదు..ఇప్పుడు వనసంరక్షణ పేరిట ప్రభుత్వాలు మొక్కలు నాటిస్తున్నాయి. గుంత ఒకడు తీస్తే..మొక్క మరొకడు నాటి ఫొటోలకు ఫోజులు ఇవ్వటంతోనే వాళ్ల పని అయిపోయింది అన్నట్లు ఉన్నారు. తులసీ గౌడ చెప్పినట్లు మొక్కను నాటటంతోనే సంతృప్తికాదు..అది మానులా ఎదిగినప్పుడే అసలైన సంతోషం వస్తుందని ప్రజలు నమ్మాలి..అలా నమ్మి సిన్సియర్ గా చేసినరోజే ఎంతోమంది తులసీగౌడలు మనదేశంలో పుట్టుకొస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news