పాకిస్థాన్‌లోని పెషావర్ మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకూ 93 మంది మృతి చెందగా.. 200 మందికి పైగా గాయపడ్డారు. భద్రతా సిబ్బంది లక్ష్యంగా చేసుకొని జరిపిన ఈ దాడిలో శిథిలాల నుంచి ఇంకా మృతదేహాలను వెలికి తీస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
‘పెషావర్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పోలీస్ లైన్స్‌లోని ఓ మసీదులో సోమవారం మధ్యాహ్నం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ రోజు కూడా శిథిలాలను తొలగిస్తున్నాం. కానీ ఎవరూ సజీవంగా ఉంటారన్న ఆశ మాత్రం లేదు’ అని సహాయక చర్యలు చేపడుతోన్న అధికారి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పెషావర్ ఆసుపత్రి అధికార ప్రతినిధి తెలిపారు. దాదాపు 20 మంది పోలీసు అధికారులు, భద్రతా సిబ్బంది ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. వారికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.