తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ తన తప్పు తెలుసుకున్నట్టుంది. తాజాగా ఆ దేశ ప్రధాని వ్యాఖ్యలు చూస్తుంటే ఏదో పశ్చాత్తాపంతో ఆవేదన చెందుతున్నట్లు కనిపిస్తోంది. ఒక అణ్వస్త్ర దేశం.. అడుక్కోవాల్సిన పరిస్థితి సిగ్గుచేటని ఇటీవల వ్యాఖ్యానించిన ఆ దేశ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
మూడు యుద్ధాలు జరిగిన తర్వాత.. పాకిస్థాన్ గుణపాఠాన్ని నేర్చుకుందని చెప్పారు. కశ్మీర్ లాంటి అంశాలపై కూర్చుని చర్చిద్దామని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పిలుపునిచ్చారు. దుబాయ్‌కు చెందిన ఓ మీడియా సంస్థతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
“భారత నాయకత్వానికి, మోదీకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే.. కశ్మీర్ లాంటి అంశాలపై ఇప్పటికైనా కూర్చుని మాట్లాకుందాం. ఒకరితో ఒకరు గొడవపడి.. బాంబులు, మందుగుండు సామగ్రి వంటివాటిపై వనరులను, సమయాన్ని వృథా చేసుకుంటున్నాం. ఈ సమస్యలను పరిష్కరించుకుని శాంతియుతంగా జీవించాలనుకుంటున్నాం. భారత్‌తో మూడు సార్లు యుద్ధం చేసి మరిన్ని కష్టాలు, పేదరికం, నిరుద్యోగాన్ని తెచ్చుకున్నాం. రెండు దేశాల్లో ఇంజినీర్లు, డాక్టర్లు, నైపుణ్యం కలిగిన కార్మికులు ఉన్నారు. వారి సేవలను ఉపయోగించుకుని ఇరుదేశాలు బలోపేతం కావొచ్చు.” — షెహబాజ్ షరీఫ్, పాకిస్థాన్ ప్రధానమంత్రి