పాకిస్థాన్ కరాచీ లోని స్టాక్ ఎక్స్ ఛేంజ్ భవనం వద్ద నిన్న దుండగులు మూకుమ్మడి దాడులకు పాల్పడ్డారు. భవనాన్ని సమీపించిన నలుగురు దుండగులు తుపాకులతో గ్రనేడ్ లతో దాడికి దిగారు, దాడిలో ఇద్దరు గార్డ్స్ ను ఓ పోలీసు అధికారిని వారు దాడి చేసి హతమార్చారు. వెంటనే రంగంలోకి దిగిన సెక్యూరిటీ దళాలు తిరిగి కాల్పులు జరపగా ఆ దుండగులు అక్కడికక్కడే మరణించారు. దేశం లోని స్టాక్ ఎక్స్ ఛేంజ్ భవనం వద్ద ఇటువంటి ఘటన జరగడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక నేడు ఈ అంశాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ ఘటన వెనుక భారత్ హస్తం ఉందని ఆరోపించారు.
ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటన కచ్చితంగా భారత్ చేతుల మీదిగానే జరిగిందని అందులో ఆయనకు ఎటువంటి అనుమానం లేదని అన్నారు. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం దేశంలో త్వరలో ఏదో అటాక్ జరగబోతుందని తనకు ఆ విషయం ముందుగానే తెలిసిందని ఆయన అన్నారు. ఇంటెలిజెన్స్ అధికారులు రెండు నెలల క్రితమే తనతో అటాక్ కు సంబంధించిన విషయాలు చెప్పినట్టు ఆయన పేర్కొన్నారు. స్వయంగా తాను కూడా ఈ అంశాన్ని తన కేబినెట్ లోని మంత్రులతో సూచించినట్టుగా అందరినీ అలర్ట్ గా ఉండమని హెచ్చరించినట్టుగా చెబుతున్నారు ఇమ్రాన్ ఖాన్. ఒకవేళ ఈ దాడి వెనుక కచ్చితంగా భారత్ హస్తమే ఉందని రుజువైతే భారత్ కు తగిన సమాధానం ఇస్తానని ఆయన హెచ్చరించారు.