పుల్వామా దాడుల తర్వాత భారత్ రెండోసారి పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా పాకిస్థాన్ గగనతలంలోకి దూసుకెళ్లి మరీ బాలాకోట్ లోని ముష్కర శిబిరాలను ధ్వంసం చేసింది. వందల సంఖ్యలో శిక్షణ పొందుతున్న ఉగ్రవాదులను భారత్ మట్టుబెట్టింది. అయితే దీనిపై భిన్న కథనాలు ఉన్నాయి. చనిపోయిన వారి సంఖ్యపై భిన్న వాదనలు ఉన్నాయి.
మృతుల సంఖ్య ఎంత అన్నదానిపై క్లారిటీ లేకపోయినా భారత్ మాత్రం బాలాకోట్ శిబిరాలను ధ్వసం చేసింది. సర్వనాశనం చేసింది. అయితే పాకిస్తాన్ మళ్లీ తన కుట్రలను బాలాకోట్ నుంచే మొదలు పెట్టిందట. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ బాలాకోట్ లోని తన శిబిరంలో మళ్లీ 50 మంది ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోందట.
ఈ విషయాన్ని భారత నిఘా వర్గాలు ధ్రువీకరించుకున్నాయి. బాలాకోట్ వైమానిక దాడి అనంతరం 6 నెలల వరకు బాలకోట్ లో ఎలాంటి కార్యకలాపాలు సాగించలేదట. కానీ తాజాగా 50 మంది ఉగ్రవాదులు ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారట. అందులోనూ వారు సుసైడ్ బాంబర్స్ అట. భారత్ లో ఆత్మహుతి దాడులు చేసేందుకు శిక్షణ పొందుతున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి.
ఈ బాలాకోట్ ఉగ్రస్థావరం కార్యకలాపాలపై భారత నిఘా సంస్థలు అత్యున్నత సాంకేతిక నిఘాతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నాయి. బాలకోట్ లో శిక్షణ తీసుకొన్న కొంతమంది ఉగ్రవాదులను ఇప్పటికే కాశ్మీర్ లోని భద్రతా శిబిరాలపై దాడులు చేసేందుకు పంపినట్లు నిఘా సంస్థల పరిశీలనలో తేలింది. అందుకే భారత ఆర్మీ సరిహద్దులను మరింత జాగ్రత్తగా జల్లెడ పడుతోంది.