పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు రంగం సిద్దమవుతోంది. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 24 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. గతేడాది 2020లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలను నిర్వహించలేదు. కరోనా కారణంగా గతేడాది శీతాకాల సమావేశాలు జరగలేదు. ఈసారి మహమ్మారి తీవ్రత ఎక్కువగా లేకపోవడంతో ప్రభుత్వ సమావేశాలను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది వర్షాకాల సమావేశాలను ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించింది. ఈ సమావేశాల్లో పెగాసస్ స్పైవేర్ పై సభ దద్దరిల్లింది.
పెగాసస్ తో ప్రతిపక్షాలపై నిఘా పెడుతున్నట్లు ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయి. దీంతో పాటు రైతు చట్టాలను ఉపసంహరించుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. గత పార్లమెంట్ సమావేశాల్లో ప్రధానంగా ప్రతిపక్షాలు పెగాసస్ వ్యవహారంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశాయి. మరో నెలలో ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధం కానున్నాయి. ముఖ్యంగా రైతు చట్టాలను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో పాటు, యూపీ లఖీంపూర్ ఖేరీ ఘటన, కాశ్మీర్లో వరసగా ఉగ్రవాదుల దాడులపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది.