ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్న కరోనా మహమ్మారికి ప్రస్తుతం మందులు ఏవీ లేకపోవడంతో అందుబాటులో ఉన్న పలు యాంటీ వైరల్ మందులతోపాటు.. ప్లాస్మా థెరపీ వంటి చికిత్సా విధానాలను వైద్యులు అనుసరిస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది కరోనా నుంచి కోలుకుంటున్నారు. అయితే ఒకసారి కరోనా వచ్చి తగ్గినా.. మరోసారి కరోనా సోకేందుకు కూడా అవకాశం ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరిస్తోంది.
కరోనా ఒక వ్యక్తికి ఒక సారి వచ్చాక.. ఆ వ్యాధి నుంచి రోగి కోలుకుంటే.. తిరిగి ఆ రోగికి మళ్లీ మళ్లీ కరోనా వచ్చేందుకు అవకాశం ఉంటుందని WHO చెబుతోంది. అందువల్ల ప్రభుత్వాలు ఈ విషయంపై కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. కరోనా సోకి నయమైన రోగులకు ఇమ్యూనిటీ బాగా ఉంటుందనే మాట వాస్తవమే అయినా.. ఆ రోగ నిరోధక శక్తి కరోనాను అడ్డుకుంటుందని చెప్పలేమని.. కరోనా మళ్లీ వచ్చేందుకు అవకాశం ఉంటుందని WHO తెలియజేసింది.
పలు దేశాలు కరోనా నుంచి కోలుకున్న రోగులకు ‘ఇమ్యూనిటీ సర్టిఫికెట్లు’ ఇచ్చి వారిని కరోనా రిస్క్ ఫ్రీ వ్యక్తులుగా గుర్తించాలని చూస్తున్నాయని, అలాగే వారికి ఇతర ప్రదేశాలకు వెళ్లేందుకు అనుమతినిచ్చేందుకు కూడా ఆలోచిస్తున్నాయని WHO తెలిపింది. అందుకనే ఈ సూచన చేసినట్లు WHO తెలియజేసింది. కనుక కరోనా వచ్చిన రోగి కోలుకున్నా సరే.. అతనికి మళ్లీ కరోనా రాదని చెప్పలేమని, అందువల్ల ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని WHO సూచిస్తోంది.