ప్రజల కోసం నిలబడ్డ నిజమైన హీరో పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు కొనియాడారు.ఎన్డీయే కూటమి తరపున చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఈరోజు తణుకులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… ‘అక్రమాలు, వ్యక్తిగత దాడులను తట్టుకుని పవన్ కళ్యాణ్ నిలబడ్డారు. శిథిలమైన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోడీ మద్దతు అవసరం. మూడు పార్టీలు కలిశాయి. ఇక వైసీపీకి డిపాజిట్లు వస్తాయా? యువత కన్నెర్ర చేస్తే జగన్ లండన్ కు పారిపోతారు అని విమర్శించారు. విధ్వంస పాలన కావాలో? అభివృద్ధిపాలన కావాలో? యువతకు ఉద్యోగాలు కావాలో? గంజాయి కావాలో? ప్రజలు ఆలోచించాలి’ అని చంద్రబాబు కోరారు.
వాలంటీర్ల వ్యవస్థ లేదని, రాజీనామా చేసినట్లు మంత్రులు మాట్లాడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ‘వాలంటీర్లు దయచేసి రాజీనామా చేయవద్దు. మేం అధికారంలోకి రాగానే వారి వేతనాలను రూ. 10వేలకు పెంచుతాం ఈ మేరకు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. వారికి మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. కూటమి అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ప్రకటిస్తాం అని తెలిపారు. బోగస్ వ్యక్తులను నమ్మకండి. దొంగలు సృష్టించే వార్తలను నమ్మవద్దు’ అని ఆయన విజ్ఞప్తి చేశారు.