పాలన చేతగాని సీఎం.. విశాఖను రాజధాని చేస్తామంటే ఎలా నమ్మాలి?: పవన్‌

-

పాలన చేతగాని ముఖ్యమంత్రి విశాఖను రాజధాని చేస్తానని చెబితే ఎలా నమ్మాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిలదీశారు. కేజీహెచ్‌లో చనిపోయిన బిడ్డను తరలించేందుకు అంబులెన్స్‌ ఇవ్వని ముఖ్యమంత్రి.. విశాఖను రాజధానిగా అభివృద్ధి చేస్తామంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు. బిడ్డ మృతదేహాన్ని తీసుకుని 120 కిలోమీటర్లు ద్విచక్రవాహనంపై వెళ్లిన ఆ గిరిజన దంపతులకు సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

కొద్ది నెలల కిందట తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి బిడ్డ మృతదేహాన్ని తరలించేందుకు ఓ తండ్రి పడిన ఇబ్బందులను పవన్‌ గుర్తు చేశారు.  మహాప్రస్థానం వాహనాల పథకం ఏమైందని ప్రశ్నించారు. బెంజిసర్కిల్‌లో అంబులెన్స్‌లు నిలబెట్టి డ్రోన్‌ విజువల్స్‌ తీసి జెండా ఊపితే చాలదని  పవన్ కల్యాణ్ అన్నారు.

వైద్యారోగ్యశాఖకు రూ.14వేల కోట్ల బడ్జెట్‌ ఇచ్చినట్టు గొప్పలు చెప్పటం మాని.. క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలు అందేలా చూడాలని పవన్ డిమాండ్ చేశారు. తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకొనేందుకు విశాఖను రాజధానిగా అభివృద్ధి చేస్తాం.. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని పవన్‌ దుయ్యబట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news