ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వానికి చాటి చెప్పే లక్ష్యంతో జనసేన విశాఖ వేదికగా భారీ ఎత్తున లాంగ్ మార్చ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇక ఈ సభలో జనసేన నేతలతో పాటు టీడీపీ మాజీ మంత్రులు సైతం పాల్గొన్నారు. ఇక జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అద్భుత పాలన అందిస్తే తాను వెళ్లి సినిమాలు తీసుకుంటానని జనసేన అధినేత పవన్ వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలోనే ఏపీ వ్యవసాయశాఖా మంత్రి కన్నబాబును సైతం పవన్ విమర్శించారు. కన్నబాబును నాగబాబు రాజకీయాల్లోకి తీసుకువచ్చారని… అలాంటిది ఇప్పుడు ఆయన కూడా తనను విమర్శిస్తున్నారని పవన్ ఎద్దేవా చేశారు. వాళ్ల బతుకులు తమకు తెలియవా? అని పవన్ వ్యాఖ్యానించారు. తాను ఓడిపోయానని బాధపడటం లేదన్నారు. భవన నిర్మాణ కార్మికులకు పనులు లేకపోతే మన జీవిత రథచక్రాలు ఆగిపోతాయన్నారు.
ఇక వైఎస్.జగన్ మాత్రమే కాదు.. సగటు రాజకీయ నాయకులు ఎవ్వరికి కూడా ప్రజల పట్ల బాధ్యత లేదని.. అలా ఉండి ఉంటే తాను ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చే వాడినే కాదని.. తాను జనసేన పార్టీ పెట్టాల్సిన అవసరమే ఉండేది కాదన్నారు. తనకు రాజకీయాలు సరదా కాదని, ఏదో నాలుగు పుస్తకాలు చదువుకుని ఇంట్లో కూర్చునేవాడినని.. సినిమాల్లోకి కూడా తాను అనుకోకుండా వచ్చానని పవన్ చెప్పుకొచ్చారు. ఇక సగటు రాజకీయ నాయకులు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నప్పుడు సామన్యుల నుంచే రాజకీయ నాయకులు పుట్టుకు వస్తారని పవన్ చెప్పారు.
ఇక తనకు ఓడిపోయినందుకు బాధ లేదని.. ఓడిపోయాకే తనపై ప్రజల్లో ప్రేమ పెరిగిందని పవన్ చెప్పారు. ఇక వైసీపీ నాయకులు చేసిన అబద్ధపు ప్రచారాలు నమ్మే ప్రజలు తనను ఓడించారని కూడా పవన్ వాపోయారు. ఇక ఈ క్రమంలోనే జగన్, విజయసాయిపై సైతం పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండున్నర సంవత్సరాలు జైలులో ఉన్న వీళ్లు.. తన గురించి మాట్లాడుతున్నారని పవన్ విమర్శించారు. దేని గురించి జైలుకెళ్లారని ఆయన ప్రశ్నించారు.