మూడు రాజధానుల విషయంలో పవన్ కళ్యాణ్.. నైస్‌గా తప్పుకొంటున్నారనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియా జనాలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. మూడు రాజధానుల విషయాన్ని ఆయన ఖండిస్తున్నారో.. లేదో చెప్పకుండా.. అమరావతికి అడ్డుపడతామని హామీ ఇవ్వకుండా తనదైన శైలిలో తప్పించుకునేందుకు పవన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితిలో అమరావతి విషయాన్ని మాట్లాడేందుకు కూడా ఆయన ఇష్టపడడం లేదనే తెలుస్తోంది. వాస్తవానికి పవన్ ఇప్పుడు బీజేపీతో జతకలిసి ఉన్నారు. ఆ పార్టీ లైన్ మేరకు అమరావతి విషయంలో ఎవరూ మాట్లాడరాదు.
తమకు మిత్రులుగా ఉన్న రాజకీయ నేతలు.. తమ పార్టీ నేతలు కూడా అమరావతిపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయొద్దని బీజేపీ అధిష్టానం నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. అందుకే గుంటూరు జిల్లాకేచెందిన మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఇక, ఇప్పుడు ఇదే బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కూడా ఏం మాట్లాడితే.. ఏమౌతుందో.. బీజేపీకి ఎక్కడ కోపం వస్తుందోనని భయపడుతున్న పరిస్థితి కళ్లకు కడుతోంది. ఈ క్రమంలోనే రోజు రోజంతా పార్టీ నేతలతో మేధోమధనం నిర్వహించిన తర్వాత తేల్చేసిన విషయం ఏంటంటే.. ఈ విషయంలో జోక్యం చేసుకోవడం మానేసి ఎదురు దాడి చేయాలని!
అదికూడా ప్రధాన ప్రతిపక్షం టీడీపీపైనే! ఈ క్రమంలోనే పవన్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలోనే మరో ప్రభుత్వం వచ్చినా రైతులకు అన్యాయం జరగకుండా చట్టం ఉండాలని జనసేన సూచించిందని పవన్ తెలిపారు. ఆనాడు తమ పార్టీ మాటలను ఎవరూ పట్టించుకోలేదని నేడు జరుగుతున్న పరిణామాలకు టీడీపీనే బాధ్యత వహించాలని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణాలను పూర్తి చేయకుండా మధ్య లోనే ఆపివేయడం టీడీపీ చేసిన అతి పెద్ద తప్పని పవన్ చెప్పుకొచ్చారు.
టీడీపీ ప్రభుత్వంలో చేసిన తప్పులను ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ కూడా స్వార్ధానికి ఉపయోగించుకుంటోందని పవన్ చెప్పుకొచ్చారు. రైతుల కన్నీరు పెట్టకుండా భూములు తీసుకోవాలని నాడు చెప్పామన్న విషయాన్ని ఈ సందర్భంగా మరోసారి జనసేనాని నిర్ణయించారు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ భవిష్యత్తు మాటేంటి? అమరావతి కోసం ఉద్యమాలు చేస్తారా? అంటే.. ఆ విషయాన్ని పవన్ ఎక్కడా మాట్లాడలేదు. పైగా.. అమరావతి రైతులు.. తనను ప్రశ్నించవద్దని ఆయన చెప్పేశారు. అంతేకాదు, ఏదైనా ప్రశ్నించాలంటే.. ముందుగా టీడీపీని, తర్వాత వైసీపీని రైతులు నిలదీయాలన్నారు. రాజధానిలో అప్పుడు కానీ, ఇప్పుడు కానీ తమ ప్రమేయం ఏమీలేదన్నారు. దీంతో పవన్ చేతులు దులుపుకొన్నట్టే అయిపోయింది.
కానీ, వాస్తవానికి రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రశ్నించకుండా ఎలా ఉంటారు? అనే కీలక విషయాన్ని పవన్ గుర్తెరగలేకపోతున్నారు. ఇక, ఇప్పుడు తాను చెప్పినట్టే రైతులు ఆ రెండు పార్టీలనే ప్రశ్నిస్తారు.. సరే! రేపు వచ్చే ఎన్నికలలో ఆ రెండు పార్టీలకే తాము ఓట్లేస్తామని అంటే.. దానికి పవన్ ఏం జవాబు చెబుతారో చూడాలి. మొత్తానికి గతంలో ఏపీ ప్రజలకు పోరాట పటిమలేదు.. అందుకే నేను ప్రత్యేక హోదా విషయాన్ని పక్కన పెట్టానన్న పవన్.. ఇప్పుడు రాజధాని విషయంలోనూ నైస్‌గా తప్పించేసుకుంటున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తుండడం గమనార్హం.