అమరావతి రాజధాని అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఉరట లభించింది. అమరావతిలో నిర్మాణాలు, స్థలాలపై డెడ్లైన్ పెట్టి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది సుప్రీం. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 31కి వాయిదా వేసింది. అలాగే ప్రతి వాదులైన రైతులకు, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.
సుప్రీంకోర్టు వ్యాఖ్యలు వికేంద్రీకరణకు బలాన్ని ఇస్తున్నాయని తెలిపారు. రాజధానిని మూడు నెలలు లేదా ఆరు నెలల్లో నిర్మించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు అంబటి రాంబాబు. రాజధానుల విషయంలో న్యాయస్థానాల జోక్యం సరైంది కాదని దీనిని బట్టి అర్థమవుతుందన్నారు. ఇక అమరావతి యాత్రకు శాశ్వత విరామం ఇచ్చినట్లేనని ఎద్దేవా చేశారు.
రైతుల వేషాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకున్నారని ఆరోపించారు. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా విమర్శలు గుప్పించారు అంబటి రాంబాబు. పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఒక పెద్ద జోకర్ అని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఇప్పటికైనా చంద్రబాబు రాజధానులకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు మానుకోవాలని హితవుపలికారు.