జగన్ పాలనపై పవన్ కల్యాణ్ చార్జ్ షీట్..!

-

వైసీపీ పాలనపై జనసేన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజాగా జరిగిన జనసేన పొలిట్ బ్యూరో సమావేశంలో జగన్ పాలనలోని లోపాలపై చర్చించారు. వైసీపీ సర్కారు తప్పులను జాబితాగా రూపొందించారు. కొత్త ఇసుక విధానం పేరుతో నిర్మాణ రంగాన్ని, అందుకు అనుబంధంగా అన్ని వ్యవస్థల్ని తిరోగమన దిశలోకి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకువెళ్ళింది అని జనసేన పొలిట్ బ్యూరో అభిప్రాయపడింది. ఇసుక లేకపోవడంతో రాష్ట్రంలో 35 లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కోల్పోయారని, వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన చెందింది.

గృహ నిర్మాణంతోపాటు, ఇన్ఫ్రా రంగం, వాటికి అనుబంధమైన వ్యాపారాలు దెబ్బ తినడంతో ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైపోయింది అని ఈ సమావేశం గుర్తించింది. రాష్ట్రానికి రావాల్సిన రాబడులు కోల్పోతూ ఆర్థిక వ్యవస్థ కుంటుపడితే అభివృద్ధి ఏ విధంగా సాధ్యమని పొలిట్ బ్యూరో ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

ఆంధ్ర ప్రదేశ్ ను శాశ్వత రాజధాని లేని రాష్ట్రంగా నిలబెట్టి ప్రజలకు పాలనాపరమైన సౌలభ్యం లేకుండా చేయడమే ప్రభుత్వ విధానంలా ఉంది అని పొలిట్ బ్యూరో అభిప్రాయం వ్యక్తం చేసింది. రాజధానికి అనువైన ప్రదేశం అన్వేషణ, నిపుణుల కమిటీ పరిశీలన అంటూ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని గుర్తించింది. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ రాజధాని విషయంలో వ్యూహాత్మకంగా గందరగోళాన్ని సృష్టిస్తున్నారు అని తప్పుబట్టింది.

గ్రామ సచివాలయ నియామకాల్లో చోటు చేసుకున్న గందరగోళాలు, నియామకాల్లో తప్పిదాల మూలంగా ప్రతిభావంతులైన నిరుద్యోగ యువతలో నిరాశానిస్పృహలు నెలకొన్నాయి అని పొలిట్ బ్యూరో అభిప్రాయపడింది. ఇప్పుడు ఏపీపీఎస్సీలో మార్పులు పేరుతో రాత పరీక్షతోనే నియామకాలు అంటే – పేపర్ లీకేజ్ లాంటి అక్రమాలు తలెత్తితే ప్రతిభావంతులు అన్యాయం అయిపోతారనే ఆందోళన యువతలో నెలకొంది అని గుర్తించింది. ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా పోటీకి సన్నద్ధమే అని పొలిట్ బ్యూరో స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news