విజయవాడలో రెండు రోజుల క్రితం జరిగిన టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ వివాహ వేడుకలో ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. రాధాకు అభినందనలు చెప్పడానికి పవన్ కళ్యాణ్ వెళ్లినప్పుడు అక్కడ తోపులాట జరిగింది. ఈ తోపులాట సమయంలో అక్కడే ఉన్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇబ్బంది పడ్డారు. ఈ వీడియో నిన్న సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. పవన్ కళ్యాణ్ వస్తే ఇలానే ఉంటుందని.. ఆయన రేంజ్ ముందు కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వాళ్లు నిలబడలేరని జనసైనికులు, పవర్ స్టార్ అభిమానులు ట్రోల్ చేశారు.
ఈ తోపులాటకు ముందు ఏం జరిగిందో చూపించే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్, కొడాలి నాని కరచాలనం చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బౌన్సర్ల వలయం మధ్యలో వంగవీటి రాధాకు అభినందనలు చెప్పడానికి పవన్ కళ్యాణ్ వెళ్లినప్పుడు.. ఆయనకు ఎదురుగా జనం మధ్యలో కొడాలి నాని ఉన్నారు. పవన్ కళ్యాణ్‌ను చూసిన వెంటనే నాని రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టారు. నానీకి పవన్ కళ్యాణ్ నవ్వుతూ ప్రతినమస్కారం చేశారు. ఆ తోపులాట మధ్యనే కొడాలి నానీతో పవన్ కళ్యాణ్ కరచాలనం చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అభిమానులు దీనిని వైరల్ చేస్తున్నారు.