ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ మీద సీనియర్ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే బొత్స సత్యనారాయణ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించి ఈరోజు ప్రివిలేజ్ కమిటీ ఆన్లైన్ లో సమావేశం కానుంది. అయితే ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. తమను సంజాయిషీ కోరకుండానే గవర్నర్ వద్ద తమ పరువు తీయడానికి నిమ్మగడ్డ ప్రయత్నించిన కారణంగానే తాము నామోషీగా ఫీల్ అయి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చామని పేర్కొన్నారు.
అయితే ఇలా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి మీద నోటీసులు ఇవ్వవచ్చా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా రాజ్యాంగబద్ధమైన సంస్థ చట్ట ప్రకారం నడుచుకోవాలి అని ఇష్టమొచ్చినట్లు నడుచుకో కూడదని ఆయన చెప్పుకొచ్చారు. గతంలో ఇలాగే మహారాష్ట్ర స్పీకర్ అక్కడి ఎన్నికల కమిషనర్ కు శిక్ష విధించారని వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని ఆయన చెప్పుకొచ్చారు.