పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్లు మనం ఇప్పటి వరకు అన్ని రకాల సహజ వనరులను కొంటూ వచ్చాం. నీళ్లను కూడా బాగా డబ్బు పెట్టి కొనే రోజులు వచ్చాయి. ఒకప్పుడు జనాలకు ఆయన ఈ విషయాన్ని చెబితే జనాలు నవ్వారు. నీళ్లను ఎవరైనా డబ్బులు పెట్టి కొంటారా ? అని హేళన చేశారు. అయితే నీళ్లే కాదు, ఇప్పుడు గాలినీ కొనే రోజులు కూడా వచ్చేశాయి. అవును.. ఆ దేశంలో స్వచ్ఛమైన గాలిని బాటిళ్ల ద్వారా విక్రయిస్తున్నారు.
యూకేలో రూ.2500 ధర పెడితే ఒక స్వచ్ఛమైన గాలి బాటిల్ లభిస్తుంది. అందులో ఉన్న గాలిని పీల్చుకుని స్వచ్ఛతను ఆస్వాదించవచ్చు. కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న నగరాలు, పట్టణాల్లో కాలుష్యం వల్ల స్వచ్ఛమైన గాలి లభించడం లేదు. అందుకనే స్వచ్ఛమైన గాలిని అందిస్తున్నామంటూ సదరు గాలి బాటిల్స్‌ను విక్రయిస్తున్న వెబ్‌సైట్ చెబుతోంది.
అయితే వినియోగదారులు తమకు నచ్చిన ఫ్లేవర్లతో కూడిన గాలిని కొనే సౌకర్యం కూడా ఉంది. ఇక ప్రస్తుతం యూకేలో ఈ గాలి బాటిల్స్ కు డిమాండ్ ఎక్కువై బాటిల్స్ స్టాక్ అయిపోతున్నాయట. వచ్చినవి వచ్చినట్లు జనాలు కొంటున్నారు. ఈ క్రమంలో మరిన్ని గాలి బాటిల్స్ ను వారు విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మన దేశంలో ఆక్సిజన్ పార్లర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో గంటకు నిర్దిష్టమైన రుసుము చెల్లిస్తే స్వచ్ఛమైన గాలిని కొంత సేపు పీల్చుకోవచ్చన్నమాట. అయితే ఇప్పుడు ఈ గాలి బాటిల్స్ మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి.