ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త. ఏపీ వాసుల తలసరి ఆదాయం 2 లక్షలు దాటింది. ఈ విషయాన్ని స్వయంగా ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ప్రకటన చేశారు. గతేడాది రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ కోవిడ్ పూర్వ స్థితికి పుంజుకుందని.. తలసరి ఆదాయం 15.87 శాతం పెరిగి 2,04,758 రూపాయలకు చేరిందని వెల్లడించారు. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలనా వ్యవస్థ ప్రారంభం కానుందని గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ప్రకటన చేశారు.
గవర్నర్ ప్రసంగం ప్రభుత్వ సంక్షేమ పధకాలపై ఎక్కువగా కొనసాగింపు ఉంటుందని.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 0.22 శాతం జీఎస్డీపీ వృద్ధి ఉందని పేర్కొన్నారు. మూడేళ్ళుగా వికేంద్రీకృత పరిపాలన ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందని… సుపరిపాలన లక్ష్యానికి అనుగుణంగా 13 జిల్లాలను 26 జిల్లాలుగా మారుస్తున్నామని ఆయన వెల్లడించారు.
ఉద్యోగులకు ఒకేసారి 5 డీఏ లు విడుదల చేసామని.. 11 వ పీఆర్సీ అమలు,రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచామన్నారు. నవ రత్నాలు అమలు ద్వారా మానవ మరియు ఆర్థిక అభివృద్ధి జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని.. నాడు-నేడు,ఆరోగ్యశ్రీ,బాలామృతం అమలు చేస్తున్నామని గవర్నర్ ప్రకటన చేశారు. వైఎస్సార్ రైతు భరోసా ద్వారా మూడు వాయిదాలలో 13500 ఆర్థిక సహాయం అందిస్తున్నామని.. పారదర్శక,అవినీతి రహిత పాలన అందిస్తున్నామన్నారు.