పీఎఫ్ఐ కేసులో ఎన్ఐఏ, ఈడీ సోదాలు, అరెస్టులతో దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. పీఎఫ్ఐ జాతీయ, రాష్ట్ర నేతలను ఎన్ఐఏ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ హర్తాళ్‌కు పిలుపునిచ్చారు ఆ సంస్థ మద్దతుదారులు. అయితే ఈ హర్తాళ్లతో పలుచోట్ల ఉద్రిక్తత నెలకొంది.
కేరళలోని తిరువనంతపురంలో పీఎఫ్ఐ కార్యకర్తలు ఓ ఆటో, కారు అద్దాలను పగలగొట్టారు. హర్తాళ్‌కు పీఎఫ్ఐ నాయకులు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు.
శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సమ్మె నిర్వహిస్తామని పీఎఫ్ఐ నాయకులు తెలిపారు. ఈ హర్తాళ్ నుంచి అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఇస్తున్నామని చెప్పారు. కేరళ ఆర్టీసీ బస్సులను కట్టక్కాడ వద్ద పీఎఫ్ఐ మద్దతుదారులు నిలిపివేశారు. మరికొన్ని చోట్ల సర్వీసులు యథావిధిగా కొనసాగుతున్నాయి. కేరళ, కన్నూర్, కాలికట్, ఎంజీ యూనివర్సిటీలు.. ఈ రోజు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశాయి.