మునుగోడులో ఫోన్ పే తరహాలో వెలిసిన కాంట్రాక్ట్ పే పోస్టర్లు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పోస్టర్ల అంశంపై ఫోన్ పే( Phone Pay) సంస్థ స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. “‘Contract Pe’పై కొన్ని ప్రసార మాధ్యమాలలో వస్తున్న వార్తలతో PhonePeకు ఎలాంటి సంబంధం లేదని మేము స్పష్టం చేయాలనుకుంటున్నాము. మా కంపెనీకి ఏ పార్టీతో కానీ, అభ్యర్థితో కానీ ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవు. ‘Contract Pe’ను రూపొందించడంలో PhonePe యొక్క లోగోను ఉపయోగించడం అనేది తప్పుదారి పట్టించేది మాత్రమే కాక, PhonePe యొక్క మేధోసంపత్తి హక్కులను ఉల్లంఘించడం కూడా కాగలదు. దీనికి సంబంధించి భవిష్యత్తులో తగిన చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు PhonePe కలిగి ఉంది.” అని పత్రికా ప్రకటనను విడుదల చేసింది ఫోన్ పే.
మునుగోడులో రాజకీయ పార్టీల ప్రచారం తారాస్థాయికి చేరింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్ధులు నామినేషన్లు వేసేశారు. అయితే బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ వేసిన కొద్దిగంటల్లోనే పోస్టర్లు వెలిసిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఫోన్ పే తరహాలోనే కాంట్రాక్ట్ పే పేరుతో ఈ పోస్టర్లు దర్శనమిచ్చాయి. దాదాపు నియోజవర్గవ్యాప్తంగా గుర్తు తెలియని వ్యక్తులు అంటించారు. ఈ వ్యవహరంపై ప్రధాన పార్టీల మధ్య పెద్ద మాటల యుద్ధమే నడిచింది. అయితే తాజాగా ఈ పోస్టర్ల పై ఫోన్ పే సంస్థ స్పందించింది.