శ్రీకాకుళం బార్ అసోసియేషన్ సభ్యులతో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన 3రాజధానులకు న్యాయవాదుల మద్దతు కోరారు. రాజ్యాంగంలో ఎక్కడా క్యాపిటల్ గిరించి ప్రస్తావన లేదని, రాజ్యాంగంలో రాజధానికి నిర్వచనం లేదన్నారు మంత్రి ధర్మాన. పాలనా సౌలభ్యం ప్రకారం నిర్ణయం తీసుకోవచ్చు అని రాజ్యాంగం చెబుతోందని, అందరి ఆకాంక్షలకు అనుగుణంగా రాజధాని ఉండాలని, శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ ను నాటి టీడీపీ ప్రభుత్వం ప్రక్కన పెట్టేసిందని మంత్రి ధర్మాన ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం తనకు అనుకూలమైన వ్యక్తులతో రాజధానిపై కమిటీ వేసుకుందని, అప్పటి సీఎం చంద్రబాబు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. అభివృద్ధి అంతా హైదరాబాద్ లో కేంద్రీకృతమవ్వటం వల్ల సమస్య వచ్చిందని శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ లో చెప్పిందని, లార్జ్ క్యాపిటల్ పనికిరాదని శివరామకృష్ణన్ చెప్పారని, పెట్టుబడి అంతా అమరావతిలో పెడితే ఎలా అని ఆయన ప్రశ్నించారు.
ఆ ప్రాంతం అభివృద్ధి చెందిన తర్వాత మనల్ని వెల్లగొడితే ఏమి కావాలని, అమరావతిలో రియల్ ఎస్టేట్ రాజధాని మోడల్ పెట్టారని, చంద్రబాబు స్వార్ధపూరిత ఆలోచనే అమరావతి అని ఆయన ధ్వజమెత్తారు. సింగపూర్ ప్రైవేట్ కంపెనీలతో లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నారని, సింగపూర్ ప్రభుత్వానికి అమరావతి రాజధానికి సంబంధం లేదని సింగపూర్ మంత్రి ఈస్వరన్ చెప్పారని, రాజ్యాంగ బద్దంగా ఏర్పడిన శివరామకృష్ణన్ కమిటీ సూచనలు అమలు చేయటమే మా ముందున్న మార్గమని ఆయన అన్నారు. మూడు రాజధానుల ఏర్పాటులో జగన్ స్వార్ధం ఏముందని, కడపలో రాజధాని పెడుతున్నాడా? భూమి విలువ రెట్టింపు అవుతుందని భూమి ఇస్తే అది త్యాగం అవుతుందా? అని ఆయన అన్నారు. చంద్రబాబు మాటలకు రైతులు మోసపోయారన్న మంత్రి ధర్మాన.. మా ప్రాంతానికి వచ్చి మా అభివృద్ధిని అడ్డుకుంటారా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.