ఈటల రాజేందర్ ను ఏదన్నా చేసి ఒంటిరిని చేయాలె. ఆయనకు మద్దతు తెలుపుతున్న నాయకులను పార్టీవైపు తిప్పుకోవాలి ఇదే ఇప్పుడు టీఆర్ ఎస్ అధిష్టానం అనుసరిస్తున్న వ్యూహం. ఇప్పటికే ఈటలకు కలిసి వస్తారనుకున్న ఉమ్మడి కరీంనగర్ మంత్రులు, నాయకులతోనే ఈటలపై ఆరోపణలు చేయించి ఆయనను నియోజకవర్గానికి పరమితం చేసిన కేసీఆర్ టీం.. ఇప్పుడు మరో వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది.
ఇందుకోసం పక్కాగా పావులు కదిపే పనిలో పడింది. ఇప్పుడు ఈటలకు మద్దతుగా కేవలం హుజూరాబాద్ నియోజకవర్గ నేతలు మాత్రమే ఉన్నారు. కాబట్టి వారికి పదవుల ఆశ చూపించి తమవైపు తిప్పుకోవాలని ఫోన్ లు చేస్తున్నారు. ఆ నియోజకవర్గ నాయకులతో అనుబంధం ఉన్న నేతలతో ఫోన్లు చేయించి పార్టీలో మంచి పదవులు ఇస్తామని, మరి కొందరికి నామినేటెడ్ పోస్టులు కూడా ఇస్తామంటూ ఎర వేస్తున్నారు.
నియోజకవర్గంలోని హుజూరాబాద్, జమ్మికుంట, కమలాపూర్, వీణవంక మండలాల ముఖ్య నేతలతో రహస్య మంతనాలు జరుపుతున్నారు. ఎలాగైనా నియోజకవర్గంలో ఈటలను పట్టు లేకుండా చేసి, ఒంటరిని చేయాలని చూస్తున్నారు. అవసరమైతే ఈటలతో మంచి సాన్నిహిత్యం ఉన్న మంత్రి హరీశ్‌రావును కూడా రంగంలోకి దింపాలని చూస్తోంది అధిష్టానం. మరి వారి ప్రయత్నాలు ఫలిస్తాయా లేక హుజూరాబాద్ నేతలు ఈటలతోనే నడుస్తారా చూడాలి.