స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తోన్న తరుణంలో ప్రధాని నరేంద్రమోదీ తన సామాజిక మాధ్యమ ఖాతాల ప్రొఫైల్ చిత్రాలను మార్చారు. ట్విటర్, ఫేస్‌బుక్ ఖాతాల డీపీ(డిస్‌ప్లే పిక్చర్)ల్లో త్రివర్ణ పతాకాన్ని ఉంచారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్న వేళ నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకను ప్రజా ఉద్యమంగా మార్చాలని ఇటీవల ప్రధాని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 2-15 తేదీల మధ్య ప్రతిఒక్కరూ తమ సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్ పిక్చర్‌గా త్రివర్ణ పతాకాన్ని ఉంచాలని కోరారు.
‘ఆగస్టు 2.. ఈ రోజు ప్రత్యేకమైంది. మనం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకను జరుపుకొంటున్న తరుణంలో.. హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో భాగంగా ఈ రోజు నా సామాజిక మాధ్యమ ఖాతాల డీపీలను మార్చాను. మీరు కూడా త్రివర్ణ పతాకంతో డీపీ మార్చాలని కోరుతున్నాను’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. కాగా ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు భాజపా నేతలు ప్రధాని బాటలో నడిచారు. తమ ఖాతాల డీపీలను త్రివర్ణ పతాకం చిత్రంతో మార్చారు.