పార్లమెంట్‌లో ‘ఇండియా’ కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై గురువారం సాయంత్రం ప్రధానమంత్రి మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షాలపై కౌంటర్ ఎటాక్ చేశారు. ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ అదృష్టమేనని ప్రధాని తెలిపారు.దేశాభివృద్ధి, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం తమ ప్రస్తుత కర్తవ్యమన్న మోదీ.. ఈ అవిశ్వాసం మీద జరిగిన చర్చ తనకు ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు. నో కాన్ఫిడెన్స్.. నో బాల్, నో బాల్ గానే సాగిందని అన్నారు. ఐదేళ్లు సమయమిచ్చినా ప్రతిపక్షాలు సిద్ధం కాలేకపోయాయని.. వీరికి పట్టిన దరిద్రం ఏంటో తనకు అర్థం కావడం లేదని ప్రధాని తెలిపారు.
“మీరు మాట్లాడిన ప్రతి మాట దేశం ఎంతో శ్రద్ధగా విన్నది. మీ మాటలు దేశ ప్రజలను నిరాశకు గురిచేశాయి. దేశానికి సంబంధించిన మంచి మాటలను వీళ్ళు వినలేకపోతున్నారు. ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేసేందుకు విఫలయత్నం చేశారు. వీరి మాటల్లో అధికార దాహం తప్ప.. పేద వారి ఆకలి నింపాలన్న ఆలోచన లేదు. అలాంటి వీళ్లు మమ్మల్ని లెక్కలు అడుగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.”2014లో దేశ ప్రజలు సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని గెలిపించారు. ఆ ట్రాక్ రికార్డు గుర్తించి 2019లో మరోసారి మరింత మెజారిటీ ఇచ్చారు.
ప్రజల కలలు సాకారం చేసేందుకు మేం ఎంతో కృషి చేస్తున్నాం. అవినీతి, కుంభకోణాలు లేని పాలనను అందిస్తున్నాం. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను మరింత ఎత్తుకు తీసుకెళ్ళాం. మన దేశ యువత సామర్థ్యాన్ని యావత్ ప్రపంచం గుర్తించింది. దేశానికి విదేశీ పెట్టుబడులు భారీగా తరలివస్తున్నాయి. దేశంలో పేదరికం వేగంగా తగ్గుతోంది. దేశంలో అతి పేదరికం దాదాపు తొలగిపోయిందని ఐఎంఎఫ్ ప్రకటించింది. DBT ,సంక్షేమ పథకాలను ఐఎంఎఫ్ ప్రశంసించింది..” అంటూ ప్రధాని మోదీ విపక్షాల చర్చకు సమాధానమిచ్చారు.