ప్రధాని నరేంద్రమోదీ రేపు హైదరాబాద్ కు వస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. రేపు ఇక్రిశాట్ లో ఓ కార్యక్రమంలో పాల్గొననున్నారు. దీంతో పాటు ముచ్చింతల్ లోని సమతా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. దీంతో ప్రధాని ప్రయాణించే మార్గాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రత కార్యక్రమాలను సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిలు సమీక్షించారు. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి పర్యటన సందర్భంగా 8 వేల మందితో భద్రత ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఎయిర్ పోర్ట్, ముచ్చింతల్, ఇక్రిశాట్ వద్ద పూర్తిగా భద్రత ఉంటుందని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. సీనియర్ అధికారులతో సెక్టార్లుగా విభజించి భద్రతను ఏర్పాటు చేశామని అన్నారు. సమతా మూర్తి కేంద్రంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని తెలిపారు. సమతా మూర్తి కేంద్రానికి వచ్చే ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
ఒకవైపు యాదాద్రి, మరోవైసు సమతామూర్తి కేంద్రాలు తయారయ్యాయని.. ఈరెండు కూడా ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రాలుగా తయారవుతాయని సీఎస్ సోమేష్ కుమార్ అన్నారు. విదేశాల నుంచి కూడా భక్తులు వస్తారని ఆయన వెల్లడించారు. త్వరలోనే యాదాద్రి దేవాలయాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు.