ఇవాళ్టి నుంచి అమెరికా పర్యటనకు మోడీ.. షెడ్యూల్ ఇదే !

ఢిల్లీ: ఇవాళ్టి నుంచి ప్రధాని మోడి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఏకంగా ఐదు రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు ప్రధాని మోడీ. ఈ పర్యటనలో “ఐక్యరాజ్య సమితి సాధారణ సభ” లో మోడి ప్రసంగించనున్నారు. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత, భారత ప్రధాని నరేంద్ర మోడి అమెరికా పర్యటన చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక ఈ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, “ఆపిల్” సంస్థ సి.ఇ.ఓ టిమ్ కుక్ తో పాటు, పలువురు ప్రపంచ నాయకులను కూడా కలవనున్నారు ప్రధాని మోడి.

అమెరికా పర్యటన కు వెళ్తున్న ప్రధాని మోడి బృందంలో , విదేశీ వ్యవహరాల మంత్రి ఎస్.జయశంకర్, విదేశీ వ్యవహరాల కార్యదర్శి హెచ్.వి. శ్రింగ్లా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో పాటు, భారత ప్రభుత్వ ఉన్నతాధికారుల బృందం కూడా ఉంది. సెప్టెంబర్ 22 అంటే ఈ రోజు, న్యూయార్క్ లో జరిగే “ఐక్యరాజ్య సమితి సాధారణ సభ” ( జనరల్ అసెంబ్లీ) సమావేశంలో పాల్గొంటారు ప్రధాని మోడి. సెప్టెంబర్ 23 న అస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాన మంత్రి యోషిహిదె సుగ లతో విడివిడిగా ద్వైపాక్షిక  సమావేశాలు నిర్వహించనున్నారు. “ఆపిల్” సంస్థ సి.ఇ.ఓ టిమ్ కుక్ తో పాటు, పలు అమెరికన్ కంపెనీల అధిపతులతో కూడా సమావేశం కానున్నారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చే విందు సమావేశంలో పాల్గొననున్నారు ప్రధాని మోడి. ఈ డిన్నర్ సమావేశానికి హాజరుకానున్నారు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్. సెప్టెంబరు 24 న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు ప్రధాని మోడి. అదే రోజు, ఇండియా, జపాన్, అస్ట్రేలియా, అమెరికా దేశాలు సభ్యులుగా ఉన్న “క్వాడ్” దేశాల సమావేశంలో పాల్గొననున్నారు. సెప్టెంబరు 25న న్యూయార్క్ లో “ఐక్యరాజ్య సమితి సాధారణ సభ” ( జనరల్ అసెంబ్లీ) నుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోడి… సెప్టెంబరు 27 న తరిగి భారత్ రానున్నారు.