ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఆ నగరానికి రూ.500 కోట్లను గిఫ్ట్‌గా ఇవ్వనున్నారు. అభివృద్ధి పనులు, ప్రజా సౌకర్యాల కోసం సదరు మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు. అదే రోజున పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు కూడా చేయనున్నారు.
అజమ్‌గడ్ నుంచి బహ్‌రెయిచ్ వరకు జాతీయ రహదారి నంబర్ 30ని నాలుగు లైన్ల రహదారిగా అభివృద్ధి చేయనున్నారు. సదరు రహదారి అయోధ్య మీదుగా వెళ్తుంది. మొత్తం 36.7 కిలోమీటర్ల రహదారిని నాలుగు లైన్లుగా మారుస్తారు. ఇందుకు సుమారుగా రూ.252 కోట్లను ఖర్చు చేస్తారు. మరో రూ.161 కోట్లతో అయోధ్యలో భక్తులకు కావల్సిన సౌకర్యాలను కల్పిస్తారు.
అయోధ్య ఆలయం ఉన్న ప్రాంతం సమీపంలో రూ.7 కోట్లతో అత్యంత అధునాతన సదుపాయాలు, హంగులతో నూతనంగా ఓ బస్ స్టేషన్‌ను నిర్మించనున్నారు. దీని వల్ల భక్తులకు మెరుగైన రవాణా సదుపాయం అందుతుంది. అలాగే 200 మంది కూర్చునే సామర్థ్యం ఉండే పోలీస్ బారక్‌ను కూడా నిర్మిస్తారు. దీనికి మరో రూ.7 కోట్లను ఖర్చు చేస్తారు. ఆయా అభివృద్ధి పనులు, ఇతర సౌకర్యాల కల్పనకు చెందిన నిర్మాణాలకు గాను ఆగస్టు 5వ తేదీనే శంకుస్థాపనలు చేస్తారని తెలుస్తోంది. అయితే వాటిలో మోదీ పాల్గొంటారా, లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.