చేయి చేయి కలిపి స్నేహం చేయమన్నారు నాడు,
వైరమే లేని మాకు “వైరస్ ” వై విడదీసావ్ నేడు,
వికటాట్టహాసం చేస్తూ
వినోదాన్ని పొందాలనుకున్నావ్,
కంటికి కనిపించని కొరోనా..
కబళించాలన్నదే నీ ఆరాటమా..
కరకు గుండె కరోనా.. ఇది నీకు తగునా?
బెదిరేదిలేదు ఎవరమైనా.. ఎదిరించి తీరుతాం ఇకపైన,
ఇంటినుండే మోగిద్దాం “సమరభేరిని”
కాలు కదపకుండానే జయిద్దాం మహమ్మారిని.
మహాశక్తివా? మహమ్మారివా?
యావత్ ప్రపంచాన్ని గుప్పిట పట్టి శాసిస్తున్నావు ఎందుకో,
అంటరానితనం నాటి సాంఘిక దురాచారం
నేటి సామాజిక దూరం చేసి ఏమి ఆశిస్తున్నావో,
అంతా ప్రక్షాళన చేయాలనుకున్నావో,
అందరిలో పరివర్తన తేవాల నుకున్నావో,
కనుమరుగైన అనుబంధాలను తెలియచేయాలనుకున్నావో,
పలకరించే తీరికే లేక పరుగులు పెట్టే పాదాలకు విశ్రాంతినివ్వాలనుకున్నావో,
కాలుష్య నివారణకు పరిష్కారం చూపాలనుకున్నావో,
ఇరుగుపొరుగు తో సంబంధం లేకున్నా ఇంటి విలువ తెలపాలనుకున్నావో,
ఇంటి నుండి బయటకు వస్తే నీ బాహువుల్లో బందిస్తానని బెదిరిస్తున్నావు ఎందుకో,
ఇంతకీ… నీవు ఎవరివో కనిపించని మహాశక్తివా? కలవరపెడుతున్న
మహమ్మారివా?
– నిర్మలారవి బొట్ల