ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు తొలిగిస్తే ఉద్రిక్తతలకు దారితీయడం సహజం. కానీ.. పెట్రోల్‌తో దాడి చేయడం.. ఒక సీఐకు మంటలు అంటుకోవడం సాధారణమైతే కాదు. అందుకే జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో జరిగిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. కబ్జాదారులకు ఇంత తెగింపు ఎక్కడిది..తెరవెనక వీరిని సపోర్ట్ చేసే నేతలెవరు ?
మేడ్చల్ జిల్లా పరిధిలోని జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మరోసారి వివాదాలకు కేంద్రంగా మారింది. భుకబ్జాలతో వార్తల్లోకి ఎక్కింది. ఆక్రమణల తొలగింపు సందర్భంగా అక్కడున్నవారు ప్రభుత్వ అధికారులపై తిరగబడ్డారు. CI భిక్షపతిరావు చేతులు కాలిపోయాయి. ఆక్రమణదారులు పెట్రోల్‌తో దాడి చేశారన్నది అక్కడి వారు చెబుతున్న మాట. ఎక్కడైనా ఆక్రమణలు తొలగిస్తుంటే.. ప్రభుత్వ సిబ్బందిని స్థానికులు అడ్డుకుంటారు. కాసేపు ఉద్రిక్తత ఉంటుంది. చివరకు సమస్య కామైపోతుంది. కానీ.. జవహర్‌నగర్ పరిధిలో అలా జరగలేదు. ఒక రకమైన తెగింపు అక్కడి వారిలో కనిపించడంతో అధికార, ప్రభుత్వ వర్గాలలోనే కాదు.. పొలిటికల్ సర్కిళ్లలోనూ ఇది చర్చకు కారణమైంది.
జవహర్‌నగర్ డెంటల్ కాలేజీ సమీపంలోని సర్వే నెంబర్ 657, 658, 219, 205ల్లోని ప్రభుత్వ భూమి కబ్జా అయింది. ఇక్కడ ఐదేళ్లుగా ఉంటున్నామన్నది స్థానికులు చెప్పేమాట. దీనికి సంబంధించిన మున్సిపల్ ట్యాక్స్, కరెంటు బిల్లులు చూపిస్తున్నారు. ఈ సమస్య రగులుతుండగానే ప్రభుత్వ భూమిగా చెబుతూ అక్కడ హెచ్చరికల బోర్డులు పెట్టారు అధికారులు. ఇక్కడే సమస్య రాజుకుందని సమాచారం. అధికారుల తీరును నిరసిస్తూ జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశాన్ని బహిష్కరించారు కార్పొరేటర్లు.
ఇంత వరకు బాగానే ఉన్నా.. భూ కబ్జాలకు సహకరించాలని కొందరు కార్పొరేటర్లు కమిషనర్ మంగమ్మపై ఒత్తిడి తెచ్చారట. అలాగే మంత్రి మల్లారెడ్డి దగ్గర తమ గోడు వెల్లబోసుకున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా కార్పొరేటర్లను వారించాల్సిన అమాత్యుల వారే.. మున్సిపల్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇలా రాజకీయ నేతల ఒత్తిళ్ల మధ్య కొన్నాళ్లు అధికారులు కామ్‌గా ఉండిపోయారు. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా నిబంధనల కొరడా బయటకు తీశారు మున్సిపల్ అధికారులు.
మున్సిపల్ కమిషనర్ మంగమ్మ, తహశీల్దార్ గౌతంకుమార్, CI బిక్షపతిరావులు సిబ్బందితో వెళ్లి ఆక్రమణలు తొలగిస్తున్న సమయంలో ఉద్రిక్తతలతోపాటు నాటకీయ పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. పెట్రోల్ పోసి నిప్పు అంటించడంతో సీఐ బిక్షపతిరావు గాయపడ్డారు. కబ్జాల జోలికి వస్తే ఎంతకైనా తెగిస్తామన్న సందేశం పంపడానికే కొందరు ప్రజాప్రతినిధులు ఇలా ప్రోత్సహించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే వీటి వెనక ఎవరు ఉన్నారన్నది ఇంకా వెల్లడి కాలేదు. తమపై వస్తున్న ఆరోపణలను కార్పొరేటర్లు ఖండిస్తున్నారు.
ఒకవైపు పోలీసుల విచారణ జరుగుతుండగానే.. మరోవైపు దర్యాప్తు అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు కూడా మొదలయ్యాయట. మరి.. జవహర్‌నగర్ ఆక్రమణల విషయంలో రాజకీయ నేతల ఒత్తిళ్లు నెగ్గుతాయో.. అధికారుల పవర్ పనిచేస్తుందో చూడాలి.