తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే అతిపెద్ద ఉత్సవాలలో గణేష్ నవరాత్రుల వేడుకలు ప్రజలు శాంతియుతంగా, ఘనంగా జరుపుకోవాలని గణేష్ నిమజ్జన ప్రణాళిక ప్రకారం ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని పోలీస్ అధికారులకు రాచకొండ సీపీ చౌహన్ వెల్లడించారు. ఈ నెల 18వ తేదీన ప్రారంభం కానున్న గణేష్ ఉత్సవాలకు సంబంధించిన భద్రత ఏర్పాట్లపై నేరెడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం డీసీపీలు, ఏసీపీలు, ఠాణా ఎస్‌హెచ్‌ఓలతో సమీక్ష నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ పండుగ వేళ ఎక్కడ కూడా చిన్న పొరపాటుకు తావు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. గణేష్ విగ్రహాల ప్రతిష్టాపన విషయంలో నిర్వాహకులతో ఇన్‌స్పెక్టర్లు ముందుగానే సమావేశమై ఏర్పాట్లను సమీక్షించాలన్నారు. ఆయా ప్రాంతాల్లోని పౌర విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ప్రశాంతమైన వాతావారణంలో వేడుకలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. జీహెచ్‌ఎంసీ(GHMC), అగ్నిమాపక, నీటి పారుదల, వైద్య విద్యుత్, రవాణా తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఠాణాల అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహించాలని, డయల్ 100కు వచ్చే కాల్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.