గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి ఇంటి వద్ద సోమవారం అర్థరాత్రి దాటాక ఉద్రిక్తత వాతావారణం చోటుచేసుకుంది. నగర శివారులోగల కొంపల్లిలోని ఆయన ఇంటివద్దకు పోలీసులు భారీ సంఖ్యలో చేరుకుని తనిఖీలు చేసేందుకు సిద్ధం అయ్యారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇంట్లో నిర్భందించి తనను పోలీసులు వేదిస్తున్నారని ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. పోలీసుల తీరుకు నిరసనగా వంటేరు తన ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. మంత్రి హరీశ్ రావు, తెరాస నేతలు తనను పెట్రోల్ పోసి కాల్చేస్తామని బెదిరించారని వంటేరు సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… తనకు ఉన్న ఆస్తులన్నింటిని అమ్ముకుని కేసీఆర్ పై పోరాడుతుంటే పోలీసులు బాధ్యత మరిచి తనను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు.
కేసీఆర్ పై తన లాంటి సామాన్యుడు పోటీచేయకూడదా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలోని పత్రికలను తెరాస ప్రభుత్వం సంకెళ్లు వేసిందని ఆరోపించారు. ఒంటేరు ఇంటివద్ద పోలీసుల వ్యవహారం అభిమానులకు తెలియడంతో అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన నివాసం వద్దకు చేరుకుని. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు.