పోలీస్‌ వర్సెస్‌ పాలిటిక్స్..ఆరోపణల వెనుక అసలు కథేంటి ?

-

మహారాష్ట్రలో పరిస్థితులు పోలీస్‌ వర్సెస్‌ పాలిటిక్స్ గా మారిపోయాయి. హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ పై వంద కోట్ల లంచం ఆరోపణలు కలకలం రేపుతున్నాయ్‌. అధికారంలో ఉన్న కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య ఈ వ్యవహారం చిచ్చు పెట్టేలా కనిపిస్తోంది. హోంమంత్రిని భర్తరఫ్‌ చేయాలని బీజేపీ డిమాండ్‌ చేస్తుంటే.. ఆ ప్రసక్తే లేదంటున్నారు శరద్‌ పవార్. అసలు కమిషనర్‌ మాటల్లోనే వాస్తవమే లేదంటున్నారు. ఈ పొలిటికల్‌ వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందన్నది హాట్‌ టాపిక్‌గా మారింది.

ముంబై మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌వీర్‌ పేల్చిన అవినీతి ఆరోపణల బాంబు.. ఉద్ధవ్‌ ఠాక్రే సర్కార్‌కు సెగ పుట్టిస్తోంది. ఈ వ్యవహారం మహా వికాస్‌ అఘాడి సర్కార్‌ను ఆగమాగం చేస్తోంది. అనిల్‌ దేశ్‌ముఖ్‌ను తప్పించాల్సిందేనని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది. ముంబై మాజీ సీపీయే హోంమంత్రిపై అవినీతి ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. విపక్షాల నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో ఏం చేయాలనే దానిపై రెండు పార్టీలు వరుసగా భేటీ అవుతున్నాయి.

శరద్‌ పవార్‌ మాత్రం అనిల్‌ దేశ్‌ముఖ్‌నే వెనకేసుకొస్తున్నారు. ఆయనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదంటున్నారు. ఇక ఇదే అంశంపై న్యాయ శాఖ అధికారులు, నిపుణులతో సీఎం ఉద్దవ్‌ ఠాక్రే సమావేశం అయ్యారు. హోంమంత్రి వ్యవహారంపై చర్చించారు. శివసేనకు ఇది ఇబ్బందికరంగా మారింది. అవినీతి ఆరోపణలు వచ్చినా.. హోంమంత్రిపై చర్యలకు వెనకాడుతున్నట్లు కనిపిస్తోంది. కాదని చర్యలు తీసుకుంటే.. ప్రభుత్వం కూలే ప్రమాదం లేకపోలేదు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్‌ సైలెంట్‌గా ఉన్నప్పటికీ.. శివసేన నేతలు మాత్రం అనిల్‌ వ్యవహారంపై మండిపడుతున్నట్లు తెలుస్తోంది.

బార్‌లు, పబ్‌ల నుంచి లంచాల వసూళ్లే కాదు.. ఆఖరికి హోంగార్డులు, ఇతర నియామకాల్లోనూ భారీ ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఫిబ్రవరిలో అనిల్‌ దేశ్‌ముఖ్‌ పోలీసులకు లంచాల టార్గెట్‌ ఇచ్చారని పరమ్‌ వీర్‌ లేఖలో పేర్కొన్నారు. నెలకు వంద కోట్లు వసూలు చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని పరమ్‌ వీర్‌ చెబుతున్నారు. సీఎంకు రాసిన లేఖ పొలిటికల్‌గా హీట్‌ పుట్టిస్తుండటంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఇప్పుడు ఉద్ధవ్‌ ఠాక్రే నిర్ణయంపై అనిల్‌ దేశ్‌ముఖ్‌ భవితవ్యం ఆధారపడి ఉంది. పరమ్‌ వీర్‌ సింగ్‌ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తుకు సీఎం మొగ్గు చూపుతారా.. లేక అనిల్‌ దేశ్‌ముఖ్‌పై కుట్ర జరిగిందన్న అంశంపై విచారణ జరుపుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు శరద్‌ యాదవ్‌ మాత్రం హోంమంత్రికి మద్దతుగా నిలబడుతున్నారు. వెనక్కి తగ్గేదే లేదంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news