కృష్ణా జిల్లాలో నాలుగు ఊళ్ళను కలిపి ప్రభుత్వం మున్సిపాలిటీగా మారుస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయ రచ్చకు తెరలేపింది. మున్సిపాలిటీగా మార్చటంపై కాదు వివాదం ఆ మున్సిపాలిటీకి ప్రభుత్వం పెట్టిన పేరుపై జరుగుతోంది రచ్చ. వైఎస్సార్ మున్సిపాలిటీగా పేరు పెట్టడంతో రాజకీయ రాద్ధాంతానికి కారణమవుతోంది.
బెజవాడ శివారు ప్రాంతాలుగా ఉన్న వాటిలో పెనమలూరు నియోజకవర్గం కూడా ఒకటి. బెజవాడ తూర్పు నియోజకవర్గానికి ఆనుకునే ఈ నియోజకవర్గం కూడా ఉంది. బెజవాడ సిటీ మాదిరిగానే ఈ నియోజకవర్గంలో సగభాగం దాదాపు అభివృద్ధి చెందింది. పెద్ద పెద్ద కాంప్లెక్సులు, విశాలమైన రోడ్లు, అభివృద్ధి పనులతో ఇక్కడ సిటీ కల్చరే ఉంటుంది. ఇందులో ప్రధానంగా కానూరు, యనమలకుదురు, తాడిగడప, పోరంకి గ్రామాలు ఉన్నాయి. ఈ నాలుగు కూడా పూర్తి స్థాయిలో బెజవాడ సిటీ మాదిరిగానే అభివృద్ది చెందాయి. వీటిని బెజవాడ కార్పొరేషన్లో కలిపి గ్రేటర్ విజయవాడ కార్పోరేషన్ గా మారుస్తామని చెప్పినా వ్యతిరేకత రావటంతో అమలుకాలేదు.
అయితే ఇప్పడు ఈ నాలుగు గ్రామాలను కలిపి ఓ మున్సిపాలిటీగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మున్సిపాలిటీకి వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీగా నామకరణం చేసింది. తొలుత మున్సిపాలిటిగా మార్చటంపై వ్యతిరేకత తెలిపిన టీడీపీ ఇప్పుడు పేరుపై అభ్యంతరాలు లేవనెత్తింది. ఈ నాలుగు గ్రామాల్లో టీడీపీ సానుభూతి పరులు ఎక్కువగా ఉండటంతోపాటు కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు అధిక సంఖ్యలో స్థిరాస్తులు కలిగి ఉన్నారు. ఇక్కడ వైఎస్సార్ పేరు పెట్టడంపై టీడీపీ అభ్యంతరాలు లేవనెత్తింది. జిల్లాలో అనేక మంది ఆదర్శనీయులు ఉండగా జిల్లాతో సంబంధంలేని వైఎస్ పేరు ఎలా పెడతారని ప్రశ్నిస్తోంది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక అభివృద్ధి పని కూడా ఈ గ్రామాల్లో జరగలేదని అలాంటపుడు ఇక్కడ వైఎస్ పేరు పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. స్థానిక ప్రజల మనోభావాలు, అభిప్రాయాలు తెలుసుకోకుండా మున్సిపాలిటీకి వైఎస్సార్ పేరు పెట్టడాన్ని తప్పుబడుతున్నారు. వైఎస్సార్ పేరుపై టీడీపీ అభ్యంతరాలు వ్యక్తంచేయటంపై స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి కూడా గట్టిగా బదులిస్తున్నారు. వైఎస్ రాష్ట్రస్థాయి నేతని ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల వల్లే ఈ ప్రాంతానికి చెందిన వారు అనేక మంది ఇంజినీర్లు, డాక్టర్లు అయ్యారని తెలుసుకోవాలంటున్నారు.
మొత్తానికి వైఎస్సార్ పేరు మున్సిపాలిటీకి పెట్టడంతో రచ్చ జరుగుతోంది. వైసీపీ, టీడీపీ సవాళ్ళు ఏ స్థాయికి వెళతాయో చూడాలి మరి.