నలుగురు ఆడుతున్న గేమ్ ఇది. దేవేంద్ర ఫడ్నవీస్, శరద్ పవార్, ఏక్ నాథ్ షిండే, ఆఖరుగా సంజయ్ రౌత్ (శివసేన ఎంపీ). ఏదేమయినప్పటికీ శివసేనలో చీలికలు వస్తాయి అని అంటున్నారు. ఒక్కసారి పార్టీల బలాబలాలు చూద్దాం. ఫలితాలు వచ్చే నాటికి.. బీజేపీ దగ్గర ఉన్న సంఖ్యా బలం 106 , శివసేన – 55, ఎన్సీపీ – 53, కాంగ్రెస్ – 44 , బహుజన్ వికాస్ అఘాడీ – 3 , సమాజ్ వాదీ పార్టీ – 2 , ఎంఎన్ఎస్ – 1 , సీపీఎం – 1, పీడబ్ల్యూపీ – 1, స్వాభిమాన పక్ష పార్టీ – 1 , రాష్ట్రీయ సమాజ్ పార్టీ – 1 , జన సురాజ్య శక్తి పార్టీ – 1 , క్రాంతి కారీ షేత్కారీ పక్ష – 1 , స్వతంత్రులు – 13.. మొత్తం 288 స్థానాలకు గాను 287 మంది సభ్యులున్నారు.
ప్రభుత్వ ఏర్పాటుకు 144 మంది సభ్యులు అవసరం కావడంతో రెండు రోజుల కిందట నుంచి కూటమి రాజకీయాలు, రిసార్టు రాజకీయాలు, పదవుల పందేరాలు మొదలయ్యాయి. ఇప్పుడు మహా వికాస్ అఘాడీ (శివసేనతో కలిపి ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీ) ఏం చేయనుందో తేలడం లేదు. ఎందుకంటే శివసేనలో చీలికలు కారణంగా ఇక ఆ పార్టీ ఎటువైపు పోతుందో కూడా అర్థం కావడం లేదు. తమను కాదునుకునిపోయిన ఏక్ నాథ్ షిండే దగ్గర ఉన్న ఇరవై మంది ఎమ్మెల్యేలూ తమతోనే టచ్ లో ఉన్నారన్నది సంజయ్ రౌత్ అనే శివసేన ఎంపీ చెబుతున్న మాట. మరోవైపు బీజేపీ కూడా బలమైన డ్రామానే ఆడుతోంది. శివసేన చీలికలను తనకు అనుగుణంగా మలుచుకునే ప్రయత్నం ఒకటి తప్పక చేయాలి.. చేస్తోంది. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాజకీయం ఫలితం ఇస్తే బీజేపీ కోటాలో సీఎం పదవి ఆయననే వరించవచ్చు. మరోవైపు బీజేపీ తనదైన శైలిలో శివసేన ఎమ్మెల్యేలపై ఈడీ అస్త్రం సంధిస్తోందని కూడా తెలుస్తోంది. దీంతో కొందరు బీజేపీ వైపు మొగ్గుచూపేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది.