కృష్ణా జిల్లా గన్నవరం వైఎస్సార్‌సీపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రూట్ మారుస్తుండడంతో గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. తాజాగా సీఎం జగన్‌మోహన్ రెడ్డితో.. వల్లభనేని వంశీ భేటీ కావడం రాజకీయంగా కలకలం రేపుతోంది. నిన్న జగన్‌తో దాదాపు అరగంటకు పైగా చర్చలు జరిపారు వంశీ. దీంతో వీరిద్దరి భేటీపై వైసీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. వైసీపీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు నివాసం ఎదుట ఆందోళనకు దిగారు.
ఈ క్రమంలోనే వల్లభనేని వద్దు – యార్లగడ్డ ముద్దు అంటూ నినాదాలు చేశారు. అయితే వంశీ ఎపిసోడ్‌పై ఇప్పటికిప్పుడు తాను స్పందించలేనని యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. కుట్రలు, కుతంత్రాలు, నకిలీ పట్టాల వల్లే గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో తాను ఓడిపోయానని యార్లగడ్డ అన్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తనకు నమ్మకం ఉందని వంశీ పార్టీలో చేరే అంశంపై జగన్ ను కలిసిన తరువాతే స్పందిస్తానన్నారు.