ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగించనున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నుంచి ఈ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని మొత్తం 18 లక్షల వ్యవసాయ విద్యుత్ మోటార్లకు 6 నెలల్లోగా మీటర్లను బిగిస్తామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఈ మేరకు నేడు విద్యుత్ శాఖపై జరిగిన సమీక్షలో పెద్దిరెడ్డి ఈ ప్రకటనను వెల్లడించారు. వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్ల బిగింపు వల్ల విద్యుత్ వినియోగంపై ఖచ్చితమైన సమాచారం తెలుస్తుందన్న పెద్దిరెడ్డి… రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా ప్రభుత్వ లక్ష్యమని కూడా ప్రకటించారు.
సాగు మోటార్లకు మీటర్ల ఏర్పాటుపై విపక్షాలది అసత్య ప్రచారమని ఆరోపించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి. రైతులు వినియోగించిన విద్యుత్ చార్జీల బిల్లుల మొత్తాన్ని రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందని, ఆ బిల్లుల మొత్తాన్ని వారే నేరుగా డిస్కంలకు చెల్లిస్తారని పేర్కొన్నారు. ఫలితంగా విద్యుత్ సరఫరాకు సంబందించి డిస్కంలలో జవాబుదారీ తనం పెరుగుతుందని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు.