ఏపీలో విపక్ష టీడీపీలో జంపింగ్ సెగలు తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. పార్టీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో పార్టీలో పలువురు కీలక నేతలు వైసీపీలోకి జంప్ చేస్తున్నారు. ప్రస్తుతం 23 మందిలో సగం వరకు యాక్టివ్‌గా ఉండటం లేదు. వీరిలో దాదాపు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారం పార్టీ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సీఎం జగన్ తో భేటీ కావడంతో ఆయన వైసీపీలోకి వెళ్లడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మరో సీనియర్ నేత కరణం బలరాం సైతం పార్టీ మారతారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే శుక్రవారం కరణం బీజేపీ ఎంపీ సుజనాచౌదరితో భేటీ కావటం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. వీరిద్దరు తాజా రాజకీయ అంశాలపై చర్చించారు. ఏపీ బీజేపీలో యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్న సుజనాచౌదరి తరచూ టిడిపి నేతలతో భేటీ అవుతుండటం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ప్రకాశం జిల్లా రాజకీయాల్లో మరో ప్రచారం కూడా జరుగుతోంది. కరణం తన కుమారుడు కరణం వెంకటేష్ ను వైసీపీలోకి పంపి… తాను టీడీపీలోనే ఉండాలనుకుంటున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం కరణం ఇటీవల వైసీపీ నేతలతో రహస్య సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది.
మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి లతో పలుమార్లు కరణం బలరాం భేటీ అయ్యారు. దాంతో ఆయన వైసీపీలో చేరతారని భావించారు. ఈ క్రమంలో సడన్ గా సుజనాతో భేటీ అవ్వడం వెనుక పెద్ద వ్యూహమే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక కరణం, వంశీ సంగతి ఇలా ఉంటే మరో ఆరుగురు ఎమ్మెల్యేల పేర్లు కూడా టీడీపీకి షాక్ ఇచ్చే లిస్టులో ఉన్నాయి. గొట్టిపాటి రవికుమార్‌తో పాటు విశాఖ జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా పార్టీకి ఎప్పుడైనా షాక్ ఇవ్వవచ్చని అంటున్నారు.
విశాఖలో తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మినహా మిగిలిన మిగిలిన ముగ్గురు ఎప్పుడైనా జంప్ చేసేయవచ్చని… వారంతా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కంట్రోల్లోనే ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తం ఓవరాల్‌గా 8 మంది ఎమ్మెల్యేలపై పార్టీలోనే చాలా సందేహాలు వస్తున్నాయి. వీరిలో చంద్రబాబు సొంత సామాజికవర్గానికే చెందిన వారు ఉండడం కూడా పార్టీ శ్రేణులను కలవర పరుస్తోంది. వీళ్లు చంద్రబాబు బుజ్జగించినా పార్టీకి లైఫ్ లేదని భావించే పార్టీ వీడి వెళ్లిపోయేందుకు రెడీ అవుతున్నట్టు భోగట్టా..?